22-10-2025 01:46:58 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల బస్తీ దవాఖానాల (Basti Dawakhana) సందర్శనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) స్పందించారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఆస్పత్రులపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే వారికి మరోసారి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని రకాల మందులు బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డయాగ్నస్టిక్స్ హబ్స్(Diagnostic Hubs) ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే రోగులకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి 24 గంటల లోపల టెస్ట్ రిపోర్టులు పేషెంట్లకు అందిస్తున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలుఅందుబాటులో ఉండటంతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో పేషెంట్ల రద్దీ తగ్గిందన్నారు.
పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులపై కొంతమంది బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమంటూ మంత్రి రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల(BRS leaders) వైఖరి ప్రైవేట్ ఆస్పత్రులకు లబ్ధి కలిగించేలా ఉందని, వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సరియైన సమయంలో బీఆర్ఎస్ నేతలకు మరోసారి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు వైద్యులు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మా ప్రయత్నం ఉంటుంది.