అమెరికాలో కాల్పులు: ఏపీ యువకుడు మృతి
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు. గత 8 నెలలుగా అమెరికాలో ఉంటూ అర్కాన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న గోపీకృష్ణపై శనివారం మధ్యాహ్నం కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. గోపీకృష్ణపై దుండగుడు తుపాకీతో కాల్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ గోపీకృష్ణ ఆదివారం మృతి చెందాడు. దాడి అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గోపీకృష్ణ మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోపీకృష్ణ భార్య, కొడుకు ఉన్నారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని యాజలి గ్రామానికి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.






