బంగాళాఖాతంపై పాక్ కన్ను!
పాకిస్థాన్ తన నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చైనా నుంచి కొనుగోలు చేసిన హంగోర్ శ్రేణి జలాంతర్గాములను సముద్రంలో మోహరించేందుకు ఆ దేశం సిద్ధమవుతున్నది. 2015లో 8 జలాంతర్గాముల కోసం చైనావూ మధ్య ఒప్పందం కుదరగా, వాటిలో మొదటిది పాక్ చేతికి ఇటీవల అందిన విషయం తెలిసిందే. అయితే, అరేబియా సముద్రానికి అవతల కూడా తమ ఉనికిని విస్తరించాలని పాకిస్థాన్ నౌకాదళ కమాండర్ ఒమర్ ఫరూఖీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సహకారంతో బంగాళాఖాతంలో పాక్ తన కార్యకలాపాలను పెంచుతుందా? భారత్‌కు రక్షణపరంగా సవాలుగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బంగాళాఖాతం భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సముద్ర తీరం. తూర్పు తీరంలోని ప్రధాన నౌకాదళ స్థావరాలు, వాణిజ్య నౌకాశ్రయాలు, ఇంధన రవాణా మార్గాలు ఈ సముద్రంతో అనుసంధానమై ఉన్నాయి.
ముఖ్యంగా విశాఖపట్నం భారత తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా ఉంది. జలాంతర్గాముల స్థావరాలు, యుద్ధనౌకల నిర్వహణ సదుపాయాలు, రక్షణ వ్యవస్థలు అక్కడే కేంద్రీకతమై ఉన్నాయి. అందువల్ల బంగాళాఖాతంలో ఇతర దేశాల సైనిక ఉనికి పెరగడం సహజంగానే భారత దృష్టిని ఆకర్షిస్తుంది.
అయితే, అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రతి దేశానికి తన సముద్ర తీరానికి ఆనుకుని 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలు; ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ నిమిత్తం మరో 12 నాటికల్ మైళ్ల వరకు సమీప జలాలు, అనంతరం వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్‌క్లూజిల్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఉండే అంతర్జాతీయ జలాల్లో ఏ దేశానికి చెందిన నౌకలైనా, జలాంతర్గాములైనా అంతర్జాతీయ నిబంధనల మేరకు సంచరించ వచ్చు.
కాబట్టి, పాక్ నౌకలు బంగాళాఖాతంలోని అంతర్జాతీయ జలాల్లో తిరగడాన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమూ లేదు. వాస్తవానికి 1971 యుద్ధంలో ఘాజీని భారత్ జలమట్టం చేసిన తర్వాత పాకిస్థాన్ బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు.
అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో దీన్ని వ్యూహాత్మక కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణ భద్రతా ముప్పు అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. పాక్ చర్యలను నిశితంగా గమనిస్తూనే, సముద్ర భద్రతను మరింత పటిష్ఠం చేసుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న సరైన మార్గమని చెప్పవచ్చు.






