calender_icon.png 5 October, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త మహాశయులకు విజ్ఞప్తి

05-10-2025 01:14:28 AM

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరక లేకుండా గడుపుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘మాస్ జాతర’. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా సరసన శ్రీలీల రెండోసారి హీరోయిన్‌గా నటిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందు కు రానుంది. ఈ నేపథ్యంలో దీని తర్వాత రవితేజ నుంచి రాబోయే ౭౬వ సినిమాపై ఆసక్తి నెలకొంది. 

కిశోర్ తిరుమల తెరకెక్కి స్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ‘ఆర్‌టీ76’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా రవితేజ టైపు మాస్ కంటెంట్‌తో కాకుండా కుటుంబ, భావోద్వేగాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేటితరం భర్తలకు కనెక్ట్ అయ్యేలా కథను సిద్ధం చేశారట డైరెక్టర్ కిశోర్. అందుకే మేకర్స్ తొలుత దీనికి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను అనుకున్నారట.

తాజాగా ఈ ప్రాజెక్టు టైటిల్ విషయమై ఒక వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూ ఆసక్తికరమైన చర్చకు తెర తీసింది. ఈ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే వినూత్న టైటిల్‌ను ఫిక్స్ చేశారట! సాధారణంగా దేవాలయాల వద్ద మైకుల్లో ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే మాట వినవస్తుంటుంది.

దాన్ని కొద్దిగా మార్చి ఈ ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చాలా క్యాచీగా ఉందంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతికశర్మ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.