02-02-2026 01:56:58 PM
షాద్‌నగర్, (విజయక్రాంతి): మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయడనికి కాంగ్రెస్ పార్టీ నేతలు టికెట్ ల కోసం హోరాహోరీ తలపడుతునారు. కొందారు నేతలు టిక్కెట్లు ఇవ్వకుంటే ఆత్మహత్య లకు పాల్పడతామని హెచ్చరికలు ఇస్తునట్లు తెలుస్తుంధీ. షాద్ నగర్ మున్సిపాల్టీలో ఆయా పార్టీల టిక్కెట్లు దక్కని అసమ్మతి నాయకులను దారిలోకి తెచ్చుకోవడం రాజకీయ పార్టీలనేతలకు పెద్ద సవాలుగా మారుతుంది. అసమ్మతి అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి అధికారిక అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే భయంతో పార్టీ అగ్రనేతలు 'బుజ్జగింపు' మంత్రాలను'ప్రయోగిస్తున్నారు.
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి తదితర నేతలు బీఫాం పంపకాలపై ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా తర్జనభజనలు చేసుకున్న నాయకులకు అనేకచోట్ల రెబల్స్ బెడద ఉండడంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక రాజీ మంత్రాలను ప్రయోగిస్తున్నారు. టిక్కెట్ దక్కని నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకులు హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులు, కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని నచ్చజెబుతున్నారు. పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారు.
బుజ్జగింపులకు లొంగని వారికి హెచ్చరికలు
బుజ్జగింపులకు లొంగకుండా మొండిగా నామినేషన్ వేసిన వారిపై పార్టీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. నామినేషన్ ఉపసంహరణ గడువులోగా వెనక్కి తీసుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని, బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. స్వయంగా పెద్ద నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కాశీనాథ్ రెడ్డి, విశాల, శివశంకర్ గౌడ్ లాంటి నేతలు రంగంలోకి దిగడంతో ఎక్కువ మొత్తంలో అసమ్మతి నాయకులు విత్ డ్రాకు సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం పోటీలో నిలుస్తామని ప్రకటిస్తున్నారు.
సర్వే రిపోర్టుల ఆదారంగా టిక్కెట్లు
టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో వివరించడానికి పార్టీ షాద్ నగర్ లో ఇప్పుడు సర్వే రిపోర్టులను ఆయుధంగా వాడుకుంటున్నాయి. సర్వేలో వేరే అభ్యర్థికి సానుకూలత ఎక్కువగా ఉందని, అందుకే ఇవ్వాల్సి వచ్చిందనే గణాంకాలతో సహా వివరిస్తున్నారు. కులం, లోకల్ సమీకరణాల వల్ల టిక్కెట్ కేటాయింపు మార్చాల్సి వచ్చిందని నచ్చజెబుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం కోసం, నామినేషన్ కోసం కొంత ఖర్చు చేస్తే, వారిని శాంతింపజేయడానికి, వారు చేసిన ఖర్చును పార్టీ భరిస్తుందని, అధికారిక అభ్యర్థి నుంచి సహకారం అందేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు. కొన్ని సర్వేలు పార్టీ అధిష్టానానికి కూడా అందడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.