09-05-2025 12:47:26 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, మే 8 (విజయ క్రాంతి) : లైసెనస్డ్ ల్యాండ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మీ సేవ కేంద్రాలలో ఈ నెల 17వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా భూమి సర్వే అంటే భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే ప్రతి దరఖాస్తుదారుడు సీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ ద్వారా తెలియజేయబడిన తేదీ నుండి సర్వే/సబ్ డివిజన్ మ్యాప్ను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు.
మొదటగా మూడు సంవత్సరాల కాలానికి లైసెన్సు జారీ కోసం అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి సీ.ఎస్.ఎస్.ఎల్.ఆర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17.05.2025 నాటికి ఓ.సీ, బీ.సీ లు అయితే 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు.
ఇంటర్మీడియట్లో గణితం సబ్జెక్టుతో కలిపి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, లేదా డ్రాఫ్ట్స్మన్ (సివిల్) ట్రేడ్లో ఎన్.సీ.వీ.టీ సర్టిఫికేట్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ. లేదా తత్సమానం నిర్వహించిన ఎస్.ఎస్.సీ పరీక్షలో ఉత్తీర్ణత, లేదా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలని, లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సర్వేయర్ మరియు ఎస్టిమేటర్ కోసం .
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం ఓ.సీ అభ్యర్థులు రూ. 10,000/-, బీ.సీలు రూ. 5,000/-, ఎస్సీ/ఎస్టీలు రూ. 2,500/- రుసుము చెల్లించాలన్నారు. శిక్షణ నిమిత్తం నమోదు కోసం మీ సేవా కేంద్రం నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం కాపీ, టెన్త్, ఇంటర్మీడియట్ కాపీలు, ఐ టి ఐ (సివిల్), డిప్లొమా (సివిల్), బీ.టెక్ (సివిల్) వంటి మార్కుల మెమోతో పాటు నిర్దేశించిన విధంగా సాంకేతిక అర్హత సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
చిరునామా రుజువుగా ఆధార్ కార్డు కాపీ, బి.సి, ఎస్.సి, ఎస్టీ అభ్యర్థులు తహశీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. లైసెన్సు సర్వేయర్ కోసం ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ లోపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.