09-05-2025 01:57:56 PM
ఎమ్మెల్యేకు టియుడబ్ల్యూజే (ఐజేయు) విజ్ఞప్తి
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(Mahabubabad MLA Bhukya Murali Naik) కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న 58 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఇంకా సుమారుగా 80 మంది వరకు వర్కింగ్ జర్నలిస్టులు జిల్లా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ ఇంటి స్థలం కేటాయించాలని, ప్రజా ప్రభుత్వంలో పాత్రికేయులందరికీ న్యాయం చేకూర్చాలని కోరారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని అర్హులైన వారందరినీ గుర్తించి మొదటి జాబితాలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో అర్హులైన జర్నలిస్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం కేటాయింపు పై ఇచ్చిన జాబితాను జిల్లా అధికారులతో చర్చించి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.