2 June, 2026 | 2:44 AM

తెలంగాణ ఆవిర్భావం రొజే అపాయింటెడ్ ప్రకటించాలి

02-06-2026 12:00 AM
  1. ముందుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
  2. తెలంగాణ జాతీయ మజ్దూర్  యూనియన్
  3. ఇందిరా పార్కు వద్ద టీజేఎంయు మహా దీక్ష

ముషీరాబాద్, జూన్ 1(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2  నే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింట్మెంట్ డేట్ గా ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్  యూని యన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాతీయ మజ్దూర్  యూనియన్ ఆధ్వర్యంలో మహాదీక్ష ను నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ మే 1న ముఖ్యమంత్రి అన్ని యూనియన్ అధ్యక్ష,  కార్యదర్శులతో సమావేశంలో మీకు ముందుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలా? లేక యూనియన్ ఎన్నికలు నిర్వహించాలా? ఏది కావాలో ఆ నిర్ణయాన్ని ఎండి కి తెలియజేయమని చెప్పిన పిదప, అన్ని యూనియన్లు విలీనం చేయాలని రాతపూర్వకంగా తెలియజేశారన్నారు.

కానీ రవాణా శాఖ మంత్రి అట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుగా ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడంతో ఆర్టీసీ ఉద్యోగులు  అయోమయానికి గురవుతున్నారని  చెప్పారు. రవాణా శాఖ మంత్రి ఈ విషయాన్ని పున పరిశీలించి ముందుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. 

దానికి సంబంధించిన అపాయింటెడ్ డేట్‌ను ఇవ్వాలని,  లేనిచో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుందని తెలిపారు. దీక్షకు ఆర్టీసీ సమాఖ్య నాయకులు రాజిరెడ్డి మద్దతు తెలిపి మాట్లాడుతూ జూన్ 2వ తేదీన వీలిన ప్రకటన చేయకుంటే తదుపరి  కార్యాచరణ చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీజేఎంయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనయ్య, గోలి రవీందర్, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రేమ్ నాథ్, రాష్ట్ర కార్యదర్షులు జీవన్, రామ్, నరేందర్, సంపత్ కుమార్, అతిక్, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కృష్ణ, సిటీ రీజినల్ సెక్రెటరీ బుల్లెట్ పాండు, సికింద్రాబాద్ రీజినల్ సెక్రెటరీ చెన్నయ్య, సమాఖ్య నాయకులు సాయి రెడ్డి, జకరయ్య, మహబూబ్ నగర్ రీజినల్ సెక్రటరీ నాగేంద్ర గౌడ్, వివిధ డిపో అధ్యక్ష,  కార్యదర్శులు నాయకులు కార్మికులు పాల్గొన్నారు.