11 August, 2026 | 2:51 AM

మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రా మహోత్సవం

11-08-2026 12:55 AM

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పాశుపత హవనం, పూర్ణాహుతి

కొండపాక, ఆగస్టు 10 (విజయక్రాంతి) : కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో సోమవారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు గణపతి పూజ, స్వస్తివాచనం నిర్వహించి నవగ్రహ, దిక్పాలక, రుద్రకలశ స్థాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు.

స్థాపిత దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకం నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. విజయదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.