11 August, 2026 | 2:48 AM

దళిత క్రైస్తవ, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి

11-08-2026 12:54 AM

1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3ని  రద్దు చేయాలి

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు 

ఖైరతాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): గత 76 ఏళ్లుగా దళిత మూలాలున్న క్రైస్తవులు,ముస్లింలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన షెడ్యూల్ కులాల హక్కులను నిరాకరిస్తూ తీవ్ర వివక్ష చూపుతున్నారని, తక్షణమే వారందరికీ ఎస్సీ హోదాను పునరుద్ధరించాలని వక్తలు డిమాండ్ చేశారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మంజు, విజయ్, ప్రభుదాస్ మాట్లాడుతూ.. 1950 ఆ గస్టు 10న అమల్లోకి వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని ‘పేరా 3’ కేవలం హిందూ మతానికి చెందిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా పరిమితం చేసిందని అన్నారు. ఆ తర్వాత సవరణల ద్వారా దళిత సిక్కులు, దళిత బౌద్ధులకు ఈ హోదా విస్తరించినప్పటికీ దళిత క్రైస్తవులు, ముస్లింలను మాత్రం మతం ప్రాతిప దికన పక్కనపెట్టడం రాజ్యాంగబద్ధమైన లౌ కిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలోని జాతీయ కమిషన్ 2007 మే నెలలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ,1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3ని పూర్తిగా తొలగించి,ఎస్సీ హోదాను మతంతో సంబంధం లేకుండా వర్తింపజేయాలని సిఫార్సు చేసిందని తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్ లు కూడా రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను ఏకగ్రీవంగా సమర్థించాయని గుర్తుచేశారు. సుదీర్ఘకాలంగా మైనార్టీ వర్గాలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.