22 July, 2026 | 1:38 AM

తవ్వేస్తున్నారు..?

22-07-2026 01:00 AM

కనుమరుగవుతున్న గుట్టలు పట్టించుకోని అధికారులు

తాడ్వాయి, జూలై 21( విజయ క్రాంతి ): తాడువాయికే తలమానికగా నిలుస్తూ అందాలనిస్తున్న గుట్టలు కనుమరుగవుతున్నాయి.. మరికొన్ని రోజులకు ఒకప్పుడు తాడ్వాయిలో గుట్టలు ఇలా ఉండేవి, గుట్టలపై విశాలమైన మైదానము,ఆహ్లాధకరమైన వాతావరణం అలా ఉంటుండేదని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా గుట్టలను తవ్వేస్తున్నారు.అడ్డు అదుపు లేకుండా తవ్వేయడంతో విశాలమైన ఎత్తున గుట్టలు మాయమవుతున్నాయి.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శ్రీ శబరిమాత ఆశ్రమం ఎదురుగా విశాలమైన ఎత్తున గుట్టలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వరుసగా కాంట్రాక్టర్లు తమ స్వార్థం కోసం గుట్టలను తవ్వేస్తున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకు అధికారులు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాడ్వాయి లోనే కాకుండా కన్కల్, కరడ్పల్లి,ఎర్రపహాడ్, దేమికలాన్,సంగోజివాడి శివారులలో గుట్టలను కాంట్రాక్టర్లు తవ్వేస్తున్నారు.

జిల్లాలో చాలాచోట్ల గుట్టల లోని మోరాన్ని,మట్టిని తరలించుకుపోతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంత తవ్వుకు పోతున్న  అధికారులు మామూళ్లకు తలొగ్గి ఏమి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు గాని పట్టించుకోవడం లేదు.

దర్జాగా మొరం తరలింపు...

 తాడ్వాయి గుట్టల నుంచి సదరు కాంట్రాక్టర్లు ఇష్టా రీతిగా మొరాన్ని తరలిస్తున్నారు.తాడ్వాయి నుంచి నూతనంగా నిర్మిస్తున్న ఇండ్లకు మొరాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.రోడ్లకు మొరాన్ని ఇండ్ల నిర్మాణా లకు తరలిస్తున్నారు. కామారెడ్డి పట్టణానికి, తాడ్వాయి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు మొరాన్ని తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

 ఎలాంటి అనుమతులు లేకుండానే..

గుట్ట నుంచి మొరాన్ని తరలించాలంటే సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల అనుమతులు ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే మొరాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దినపత్రికలలో కథనాలు ప్రచురణ అయిన సమయంలో  అధికారులు అటువైపు అలా వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు.

దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది మొరం తరలించాలంటే సదరు భూమి ధ్రువపత్రాలు సమర్పించి ఎంత విస్తీర్ణంలో ఏ సర్వే నంబర్ లో మట్టిని తరలించాలో పూర్తిగా ఆ భూమికి సంబంధించిన అనుమతులు పొంది ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్లు మొరాన్ని తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న మొరాన్ని నిరోధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

అధికారుల కనుసైగల్లోనే జరుగుతుందా...?

గుట్టల నుంచి అక్రమంగా మొరం తరలింపు అధికారుల కనసైగలలోనే జరుగుతుందా అనే  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే దర్జాగా పగటివేలలో ప్రోక్లైన్ లు పెట్టుకొని తవ్వుతూ దర్జాగా టిప్పర్లలో తరలిస్తున్నారు.ఇది చూసిన ఏ అధికారి పట్టించుకోవడం లేదు. దీంతో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అని ప్రజలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.