calender_icon.png 4 July, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాల్‌కు సిద్ధమా హరీశ్?

04-07-2025 01:21:27 AM

  1. బనకచర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 
  2. చేపల పులుసు తిని నీటి వాటా విషయంలో రాజీపడ్డారు 
  3. బీసీ రిజర్వేషన్లపై ఖర్గేకు కవిత ఏ పార్టీ నుంచి లేఖ రాశారు? 
  4. కేసీఆర్, కిషన్‌రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం
  5. గాంధీభవన్‌లో మీడియాతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బనకచర్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సిద్ధమా? అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు..? రోజా ఇంట్లో చేపల పులుసు తిని నీటి వాటా విషయంలో కాంప్రమైజ్ అయింది మీరే కదా..?’ అని నిలదీశారు.

బనకచర్లపై బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం విడ్డూరంగా ఉందని, నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉందని విమర్శించారు.

ఖర్గేకు కవిత జాగృతి తరపున లేఖ రాశారా..? బీఆర్‌ఎస్ తరపున రాశారా..? అనేది క్లారిటీ లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు వెలగబెట్టిందెంటో చెప్పాలన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆరేనని తెలిపారు. రాజకీయ శూన్యంలో కవిత మనుగడ కోసం బీసీల జపం చేస్తున్నారని, బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకు లేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని, స్థానిక సంస్థలతో పాటు విద్య, వైద్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సమయంలో కవిత లిక్కర్ స్కామ్‌లో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారని తెలిపారు. ఆస్తి పంపకాల వాటా తెగిందా..? అని కవితను ప్రశ్నించారు. బీజేపీతో కాంగ్రెస్‌కు ఏమి సంబంధమన్నారు.

కిషన్‌రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఫేవికాల్ బంధం ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీని నియమించలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఎల్బీస్టేడియంలో శుక్రవారం జరిగే సామాజిక న్యాయ సమరభేరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గ్రామ, మండల, జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరవుతారని తెలిపారు. పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు ఖర్గే దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

ఎమ్మెల్యే అనురుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ పరిశీలిస్తోంది..  

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి  చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు పార్టీ క్రమశిక్షణ కమిటీ పర్యవేక్షణ చేస్తోందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాక చర్యలుంటాయని తెలిపారు. పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా క్రమశిక్షణతో ఉండాలన్నారు.