04-07-2025 01:18:36 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): అంగన్వాడీ హెల్పర్లకు రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ఠ వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై గురువారం సంతకం చేశారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ర్టవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం కలిగింది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్లీ అవకాశం లభించనుంది. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో.. 50 ఏళ్ల వయస్సులో టీచర్‌గా పదోన్నతి పొందే హెల్పర్లు ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు.
45 సంవత్సరాల వయస్సు దాటిన అరులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి.
ఈ నిర్ణయంతో రాష్ర్టవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేవలం వయస్సు కారణంగా తాము టీచర్లుగా ప్రమోషన్ కోల్పోతున్నామని బాధపడిన తమకు సీతక్క న్యాయం చేశారని వారు ఆనందం వ్యక్తం చేశారు.