27-04-2025 12:00:00 AM
కొంతమందికి బస్సు ప్రయాణం అంటే కంగారు పడిపోతారు. మరికొందరు కారు, రైలు, విమాన ప్రయాణాలన్నా హడలెత్తిపోతారు. కారణం.. ప్రయాణాల్లో వాంతులు, వికారం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, అలసట వంటి లక్షణాలు వాళ్లని స్థిమితంగా ఉండనీయవు. దీన్నే మోషన్ సిక్‌నెస్ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
తప్పనిసరి ప్రయాణాలైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఈ సమస్యకు ట్యాబ్లెట్స్ కాకుండా.. శబ్దంతో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది జపాన్‌లోని నాగోయా యూనివర్సిటీ. వాహనాల్లో వేగంగా ప్రయాణించేటప్పుడు కళ్లు చూసేదానికి, చెవి గ్రహించే శబ్దాలకి మధ్య సమన్వయం ఉండదు. దాంతో మెదడు అయోమయానికి గురై మనకు వాంతులు అవుతుంటాయి. మనకిలా వికారం కలగడానికి కారణం చెవిలోపల ఉండే యూట్రికెల్ అనే భాగమే.
చెవికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ఒక నిర్ణీత మోతాదులో ఉన్న శబ్దాన్ని ఈ యూట్రికెల్‌కి వినిపిస్తే మెదడు అయోమయానికి గురవదు. దాంతో వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. విమానాలు, బస్సుల్లో హెడ్‌రెస్ట్‌లకు.. శబ్దాన్ని విడుదల చేసేలా ప్రత్యేక పరికరాలని అమర్చడం ద్వారా మోషన్ సిక్‌నెస్‌కు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.