గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి భారీ ఎత్తున ప్రారంభమయ్యే వినాయక నిమజ్జన ఊరేగింపు అనాదిగా వస్తున్న వాస్తు ప్రకారంగా నిర్ణయించిన మార్గం గుండా ప్రారంభం కానున్నది.
భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్, సీ.పీ నిశితంగా పరిశీలించారు. అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు.
జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఉమ్మెడ మార్గాన్ని, బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. వినాయక బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏర్పాట్ల విషయమై కలెక్టర్, సీ.పీ సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు.






