20-07-2025 12:00:00 AM
సామగ్రి సేకరణ, వాటి పనితీరుపై తనిఖీ చేయాలని సూచన
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామగ్రి సేకరణ, వాటి పనితీరుపై మండలాలు, గ్రామాల వారీగా తనిఖీలు చేసి నివేదిక అందించాలని కోరారు. అవసరమైన చోట కొత్తవి సమకూర్చేందుకు ఇండెంట్ పంపాలని స్పష్టం చేశారు.
కాగా బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. రెండు విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ముందుగా ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనునున్నట్టు సమాచారం. గతంలో సర్పంచ్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ వారీగా మూడు విడతలుగా జరిగేవి. కానీ ఈసారి రెండు విడతల్లోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.