11 June, 2026 | 2:49 AM

నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

11-06-2026 02:01 AM

జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి, జూన్ 10: జిల్లాలో నిర్వహించనున్న నీట్ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ పాండు ఆదేశించారు.

జూన్ 21న మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,924 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.

పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 9 పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్-144 అమలు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

నీట్ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ స్థాయి పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా  నోడల్ అధికారి (ఎన్టిఏ) భారతీదేవి , జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ , వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, ఆర్టీసీ, విద్యుత్, పోస్టల్ , రెవెన్యూ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.