‘బెల్ట్’ పెడితే రూ.50వేల జరిమానా
మాగ్ధూంపూర్ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
సమాచారం ఇస్తే రూ.5 వేల నగదు బహుమతి
నంగునూరు, జూన్ 10: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మగ్ధూంపూర్ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ బుధవారం గ్రామ సభలో పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ పాకాల శ్రీనివాస్ మాట్లాడుతూ..గ్రామంలో ఎవరైనా గుట్టుగా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
మద్యం అమ్మే వారి వివరాలు తెలిపిన వారికి రూ.5 వేల బహుమతి అందజేస్తామన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలోనే చదివించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లాస్య నర్సింలు,పంచాయతీ కార్యదర్శి గౌతమ్,వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






