30-09-2025 04:09:53 PM
జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులది కీలక పాత్ర ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు రిటార్జింగ్ అధికారులది కీలక బాధ్యత ఉంటుందని తెలిపారు. స్థానిక ఎన్నికలు వనపర్తి జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడత ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు.
అంతకంటే ముందుగానే రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని తగిన సిబ్బంది, గోడ గడియారం, వంద మీటర్ల హద్దు సూచించే బౌండరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నోటిఫికేషన్ ను ఆర్ఒ కార్యాలయం, కలెక్టరేట్ నోటీస్ బోర్డు పై పెట్టాల్సి ఉంటుందన్నారు. మొదటి విడత ఎన్నికలకు అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్ 13 నుండి 15వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.
నాలినేషన్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని, నామినేషన్ పత్రంలో అభ్యర్థి ఏమైనా తప్పులు చేసిన, సంతకాలు లేకున్నా, తగిన ధృవ పత్రాలు జత చేయకున్నా రిటర్నింగ్ అధికారి గుర్తించి సరి చేయించాలని, నామినేషన్ సాధ్యమైనంత వరకు రిజెక్ట్ కాకుండా చూడాలని ఆదేశించారు. ఏదైనా ధ్రువపత్రం జతచేయని పక్షంలో నిర్దుష్ట సమయంలో అభ్యర్థికి నోటీస్ జారీ చేయాలని, సకాలంలో ధృవీకరణ పత్రం సమర్పించని పక్షంలో మాత్రమే నామినేషన్ రిజెక్ట్ చేయాలని సూచించారు. నామినేషన్ వేసేందుకు 100 మీటర్ల పరిధిలో కేవలం ఒకే ఒక వాహనం వచ్చేందుకు అనుమతి ఉంటుంది. నామినేషన్ వేసేందుకు ఆట. ఒ గదికి ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని నియమావళి వివరించారు.
నామినేషన్ ఉపసంహరణ అనేది నిర్దిష్ట తేదీ నాడు నిర్దిష్ట సమయంలో మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. గుర్తులు కేటాయింపు అనేది సైతం నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. గుర్తులు కేటాయింపు విషయంలో గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు బి.ఫారం ఇచ్చిన అభ్యర్థులకు కేటాయించి స్వతంత్ర అభ్యర్థుల విషయంలో అభ్యర్థి పేరుకు తెలుగు అక్షరాలకు అనుగుణంగా గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులది చాలా కీలక పాత్ర ఉంటుందని, అందువల్ల ఎన్నికల నియమావళి ప్రతి పేజీ ప్రతి అక్షరాన్ని చదువుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రిటర్నింగ్ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.