శంషాబాద్‌లో అక్రమ మద్యం పట్టివేత
ఆరుగురిపై కేసు నమోదు
రంగారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సాతంరాయి గ్రామంలో బగ్గా డిస్టిలరీస్ కంపెనీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖను బురిడీ కొట్టించి రూ.5 లక్షల విలువ చేసే మద్యాన్ని ప్రభుత్వానికి ఎలాంటి సుంకం చెల్లించకుండా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్న ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బగ్గా డిస్టిలరీస్ సంస్థ కొంతకాలంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం సరఫరా చేస్తోంది.
అయితే, కంపెనీ మేనేజర్ రమేశ్‌తో పాటు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో వంద కాటన్ల మద్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. వాటి స్థానంలో వేరే మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ విషయమై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందడంతో తనిఖీ నిర్వహించగా, అసలు విషయం బయట పడింది. మద్యాన్ని సీజ్ చేయడంతో పాటు మేనేజర్ రమేశ్, యజమాని జస్‌మిత్ సింగ్, పాషం లింగారెడ్డి, మామిండ్ల అశోక్, వెంకటేశ్, మరో మహిళపై కేసు నమోదు చేశారు. మేనేజర్ రమేశ్‌ను అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు.






