ఇద్దరి హత్య కేసులో నిందితుల అరెస్టు
జగిత్యాల, మే 20 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులా పూర్ గ్రామంలో దీటి శ్రీనివాస్, దీటి మహేష్‌లను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిందితులను అరెస్టు చేసిన అనంతరం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్, జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచు పల్లి గంగరాజం, మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ అనే వ్యక్తులు గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, దీటి మహేష్‌లపై ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకొని ఇనుప పైపులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు.
తీవ్రంగా గాయపడిన మహేష్‌ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క మమత ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేశారు. సోమవారం బుగ్గారం రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలు, ఒక కారు, 2 బైకులు, 7 సెల్ ఫోన్లు సాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.






