ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకే అరైవ్ అలైవ్ వీక్ నిర్వహణ
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా. అరైవ్ అలైవ్ వీక్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ అలైవ్ కార్యక్రమాలలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు సేఫ్టీ సమీక్ష సమావేశము నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ.. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ కమిటి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.
అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. జిల్లా ఎస్ పి డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా లో బ్లాక్ స్పారట్స్ గుర్తించి, సైన్ బోరడ్స్, ఏర్పాటు పై పి పి టి ద్వారా వివరించారు. అలైవ్ అరైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి రోడ్డు సేఫ్టీ పై అవగాహనా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలు ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ,రెవిన్యూ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రవాణా అన్ని శాఖల జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.




