5 June, 2026 | 1:48 AM

పులి జాడ ఎక్కడ..?

05-06-2026 01:00 AM

బోను పెట్టేదెప్పుడు.. పులిని పట్టేదెప్పుడు..

భయాందోళనలో ప్రజలు..

తాడ్వాయి,జూన్,4( విజయ క్రాంతి ): అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగిపోయింది.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతాల పక్కన ఉన్న గ్రామాలు,తండాల ప్రజలు మరింత వణికి పోతున్నారు.ఎప్పుడు పులి ఎక్కడి నుంచి వస్తుందోనని ఏమి చేస్తుందోనని భయపడిపోతున్నారు. కామారెడ్డి జిల్లా తాడువాయి, లింగంపేట, రాజంపేట, ఎల్లారెడ్డి మండలాల శివారులోని అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయి.

వివిధ పనుల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రైతులకు చిరుత పులి అగుపడుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు.చిరుత పులిని పట్టుకోడానికి అధికారులు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలు చిరుత పులి జాడ ఎక్కడుంది ఏమైనా గాలింపు చర్యలు చేపట్టారా అని అటవీ శాఖ అధికారులను  ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చిరుత పులి దాడి చేసి లేగ దూడలను, మేకలను హతమార్చిన సమయంలో అటవీశాఖ అధికారులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని హడావుడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. తదనంతరం చిరుత పులినిj పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాడ్వాయి మండలం శివారు గ్రామాల ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంత ప్రజలు మరింత జంకుతున్నారు.ఎప్పుడు పులి వస్తుంది, ఎప్పుడు తమ పశువుల పై దాడి చేస్తుందో నని భయపడుతున్నారు.

ఇటీవల తాడువాయి  మండలం నందివాడ పరిధిలోని సామదుబ్బ తండా లో మూడు లేగ దూడలపై చిరుత పులి దాడి చేసి హత మార్చింది.దీంతో రూ.60 వేల ఆస్తి నష్టం జరిగింది.సదరు పేదరైతు రమేష్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గతంలో నందివాడ శివారులోని పిర్మాయకుంట తండా ప్రాంతంలో ఓ లేగ దూడను చిరుత పులి హతమార్చింది. ఎర్రపహాడ్ శివారులో, దేమికలాన్ శివారులో ఇదే సంఘటనలు చోటుచేసుకున్నాయి.దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికి పోతున్నారు.

పులికి బోను పెట్టేదెప్పుడు..

పులిని పట్టుకోవడం కోసం పులికి బోను ఎప్పుడు పెడతారని అటవీ ప్రాంత శివారులోని ప్రజలు అటవీ శాఖ అధికారులను  ప్రశ్నిస్తున్నారు.రాత్రింబవళ్లు అటవీ ప్రాంతం పక్కనే ఉంటామని తమకు పులి నుంచి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వెంటనే పులికి బోను ఏర్పాటు చేసి పట్టుకోవాలని కోరుతున్నారు.పులి నుంచి మీకు రక్షణ కల్పిస్తాం అని అధికారులు చెబుతున్నారే కానీ అమలు చేయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

పులి బోను కోసం ప్రతిపాదనలు..

పులిని బంధించడం కోసం బోను ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదివరకే అధికారులకు బోను కోసం ప్రతిపాదనలు తయారుచేసి పై అధికారులకు పంపించినట్లు తెలిపారు. పై అధికారులు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు ఈ ప్రాంతంలో బోను ఏర్పాటు చేస్తామని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ తెలిపారు. వైల్ లైఫ్ పిసిసిఎఫ్ పర్మిషన్ ఇవ్వగానే బోను ఏర్పాటు చేస్తామన్నారు.