10 May, 2026 | 5:24 AM

రెండు సౌందర్య శిఖరాలు

13-05-2024 12:05 AM

20వ శతాబ్దంలో నూతన కవిత్వాభివ్యక్తికి ప్రధాన ప్రతీకలు రాయప్రోలు, కృష్ణశాస్త్రి ఇద్దరునూ. కృష్ణశాస్త్రి కవిత్వంలో అభివ్యక్తి బింబములకు ప్రతీకలకు సంబంధించింది. రాయప్రోలు వారి అభివ్యక్తి నూతన ప్రాణాన్ని శబ్ద కుహరంలోనికి ప్రవేశింపజేయడంవల్ల వచ్చింది. కృష్ణశాస్త్రి అభివ్యక్తి మార్గంలో మన జీవన పరిమితులను స్పృశింపని వైదేశిక ముద్ర ఉంటుంది.

కృష్ణశాస్త్రి గారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. సాహిత్య రంగంలో ఎదిగి వస్తున్న యువకులను చూస్తే మీకు నచ్చిన పదిమంది తెలుగు కవుల పేర్లను చెప్పుమని అడిగేవారు. వారు ఆ కవుల పేర్లు వ్రాసిన తరువాత చూచి వారి సాహిత్య అభిరుచులను, ఆస్వాదశక్తిని అభిమానాన్ని ప్రక్రియలపైన ఉన్న మమకారాన్ని అంచనా వేసుకునేవారు. తన కవిత్వాన్ని గూర్చి ఆయనకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండేది. చివరి రోజుల దాకా తన సహచరులైన, సమ వయస్కులైన సాహితీ సమితి కవులయందు ఆయనకు మమకారము తొలగి పోలేదు. ఆయన ఉపన్యాసాన్ని తొలిసారిగా 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 57వ నంబరు హాల్‌లో విన్నప్పుడు పులకరించిపోయాను.

హైదరాబాద్ ఆకాశవాణిలో ఉన్నప్పుడు తరచుగా కలుసుకునే వాళ్ళం. ఆయన గొంతు మూగ పోయిన తరువాత వ్రాత మూలంగా ఆయన వ్యవహరించటం చూచినపుడు ఒక విషాదపురేఖ మాలో ప్రతిధ్వనించేది. కాటూరి వారు, శివ శంకర స్వామి మొదలైన పెద్దల్ని అక్కడ కలుసుకునే అవకాశం ఉండేది. తీవ్రమైన అభిమానాలు అనిష్టాలు ఆయనకుండేవి. ఆయన రచనలో వలెనే ఆయన అభిరుచిలోనూ ఒక సౌకుమార్యం ఎప్పుడూ తళతళలాడేది. మద్రాసులో ఆయనను చివరిసారిగా కలుసుకున్నప్పుడు నేనొక మాట అన్నాను. ‘మీ కవిత్వం ఏదీ నిలుస్తుందో లేదో చెప్పలేనుగానీ ఇపుడు భక్తిరంజనిలో వస్తున్న గీతాలు మాత్రం ఆత్మ లోలోతుల్లోని వేదనను వెలికి తీసేవిగా శాశ్వతంగా ఉంటాయి’ అని. ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆమోదసూచకంగా తల ఊపారు.

నా అదృష్టం కొద్దీ సాలప్రాంశువులైన ఆ తరం కవులలో ఎక్కువ మందితో సాన్నిహిత్యం లభించింది. వారి వారి మధ్య ఏ భేదాలున్నా మావంటి వారిని వాత్సల్యంతో చూచేవారు. రాయప్రోలు సుబ్బారావు గారు మరీ అమాయకపు మనిషి. ఏకాంతంగా మారేడుపల్లిలోని స్వగృహంలో ఒక ఋషిలాగా జీవించారు. ఆయన భావుకత్వం చివరి రోజులదాకా మరుగున పడలేదు. తరిగిపోలేదు. ఆధునిక కావ్య జగత్తులో నూతన కావ్య భాషా నిర్మాణం చేసిన ఆయన ఊహాకాశంలో మృదుల సరళాక్షరముల సమ్మేళనమున తెలుగు శబ్దాలు నూతన భావముద్రతో ఆవిష్కరింపబడేవి. ఎక్కువభాగం ఆయన భావుకుడుగా వ్యక్తావ్యక్త చేతస్సంధి దశలో ఉన్నట్లుగా కనిపించేవారు. ఎవరిని గూర్చి అయినా పరుషపు పలుకు పలుకగా నేను వినలేదు.

20వ శతాబ్దంలో నూతన కవిత్వాభివ్యక్తికి ప్రధాన ప్రతీకలు రాయప్రోలు, కృష్ణశాస్త్రి ఇద్దరునూ. కృష్ణశాస్త్రి కవిత్వంలో అభివ్యక్తి బింబములకు ప్రతీకలకు సంబంధించింది. రాయప్రోలు వారి అభివ్యక్తి నూతన ప్రాణాన్ని శబ్ద కుహరంలోనికి ప్రవేశింపజేయడంవల్ల వచ్చింది. కృష్ణశాస్త్రి అభివ్యక్తి మార్గంలో మన జీవన పరిమితులను స్పృశింపని వైదేశిక ముద్ర ఉంటుంది. అనుభవ సీమల్లోకి దూరదూర తీరాలనుంచి ఒక పక్షి వచ్చి వాలినట్లో, ఒక మబ్బు కన్నె ప్రయాణించినట్లో, నూతన శబ్దం తలుపును త్రోసుకుంటూ వస్తుంది.

రాయప్రోలు శబ్ద సమ్మేళనం ఎంత ఆత్మీయమో అంత అభినవం కూడా. వచో రమ్య వ్రతాచార్యుడు, క్లీబ సౌందర్యము, కొదమ మబ్బులు, వెండి లాంతరు, పాలు తీసిన పొదుగు లట్టుల వాలబడె సంక్రాంతి మబ్బులు, మాతృభూమి సమస్త లోకాలోక కామ సవిత్రి, అనుభూతి విసరు సువాసనలు, ప్రియవాణి పిదికె పీయూషమును, విచార తంతువు, బ్రహ్మాండ భాండము, ధ్యాన ధారలు (మిశ్ర మంజరి), ఏడాది తొలి కౌగిలి, పాద పద్మ చక్రము, పుల్గు బాలెంత, స్వప్న నగరాలు, ప్రేమ కళాంశలు, మహా నాయక స్ఫారఫలాంశ, సురభిళామల వచోముకురము, చిగురు కొమ్మలకు పగడాల సరమయి (ఆంధ్రావళి), పసుపు పిట్టలు, తేనెదోసిలి (చందమామ), తెల్లపాగా పెట్టి నల్ల గుఱ్ఱంబెక్కి చెంగనాలెత్తేవు, వెన్నెలబండ్లు, అరిటాకు పళ్ళెము, రత్నాలతొనలు (కన్నెపాటలు) ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ఆయన భాష సృష్టించి తొంభై సంవత్సరాలు యించుమించుగా అవుతూ వుండడం వల్ల కొంత అలవాటయి కొత్తదనం తగ్గి ఉండవచ్చు. అయితే ఆ సరస్వతీ ప్రాదుర్భావమైన ఉషస్సులో అది అత్యంత సమ్మోహకంగా సాగిపోయిన అంశం.

కవి సృష్టించే భాష ప్రధానంగా ఒక ఇంద్రజాలం వంటి స్థితి. అవే శబ్దాలు అవే అర్థాలు, అవే వర్ణములు ధ్వనులు అయినా కవి మంత్రదండం తాకిడికి శబ్దం నూతన అభివ్యక్తి సంపుటం అవుతుంది. నూతనానుభవానికి ద్వార కవాట పాటన కారకమవుతుంది.

జాతీయోద్యమ శకంలో కవిత్వంలో ఆవేశం ఒకవైపు సౌందర్యానుభవం మరోవైపు అభినవ సృజనాను లక్షణం వేరొకవైపు ఆవరించాయి. ఈ కాల్పనిక వైఖరి ఆవిష్కారం రాయప్రోలు ఇంద్రజాలంతో సంభవమయింది. ఆయన వచనమూ అంతే అందాన్ని నిలుపుకొన్నది. ‘నీ వక్కాణము చిగురాకుల మీద చిన్ని తేనెలు చెమర్చినట్లున్నది’. ‘అతని కంఠంలో నాదభారతి మాధురీ క్షీరమధనం వినేవారి అంతఃకోశాలన్నీ కమ్మగిల్లి కళలంటేవి’. ‘చిగురాకు పెళుసెక్కుతున్నది’, ‘స్త్రీ చైతన్యములో కారుణ్య ధాతువు అధికాధికంగా ఉన్నది’ (రూపనవనీతం).

ఆనాటి కవిత్వ చరిత్రలో కృష్ణశాస్త్రిది తళుక్కునమెరసి మాయమయ్యే సౌదామనీద్యుతి. రాయప్రోలు వారిది తెలుగు అక్షర జగత్తును మధించి వెలికి తెచ్చిన నవనీత మాధుర్యం. మూడు కోట్ల తెలుగువాళ్ల నాలుకలనే దేవాలయంలో నినదించే ప్రార్థన గీతం.

కోవెల సుప్రసన్నాచార్య

(‘భావసంధ్య’ నుంచి..)