10 May, 2026 | 3:57 AM

సమున్నత శక్తులుగా సాహిత్య సంస్థలు

13-05-2024 12:05 AM

మారిన మనుషుల మనోభావాల నేపథ్యంలో ఆయా ‘సంస్థ’లపట్ల ప్రజలలో సదభిప్రాయం లేకుండా పోయింది. మిగిలిన రంగాల సంస్థల మాటెలా వున్నా సాహిత్య సంస్థల విషయం మాత్రం నూటికి తొంభై తొమ్మిది శాతం అలా కాదు. సాహిత్య సంస్థలు స్థాపించి వాటితో పబ్బం గడుపుకొనే వ్యక్తులు చరిత్ర పొడుగునా వెతికినా దాదాపు కనిపించరు. ఎందుకంటే, అక్షరాలు వ్యాపార సోపానాలు కావు కనుక. ఒక ప్రతిష్ఠాత్మక సంస్థలో సభ్యులు కావాలని తపించిపోయే వారినే మనం ఎక్కువగా చూస్తాం. ఆయా సంస్థలకు తమ జీవితాలను ధారపోసిన మహానుభావులూ ఎందరో తారస పడతారు. 

రెండున్నర వేల ఏండ్ల తెలుగు భాషా వికాస చరిత్రలో ‘సామూహిక కపిరాజ సైన్యం’ వలె సాహిత్య సంస్థలు ద్విగుణీకృతమైన పాత్రనే పోషించాయి. అసలు, తెలుగులో సారస్వత సంస్థలు ఎప్పుడు, ఎందుకు పుట్టాయి? ఎలాయెలా పరిణామం చెందాయి? ఏఏ సంస్థల భాగస్వామ్యం ఏ మేరకు సాధ్యమైంది? ఎవరెవరు ఆయా సంస్థల అక్షర యజ్ఞయాగాదులలో సమిధలుగా ధన్యజీవులయ్యారు? వంటి విషయా లలోకి వెళితే అదొక మహాసముద్రమే. సుమారు మూడున్నర దశాబ్దాల కిందటే ఎందరికో అందని ఈ అరుదైన ఉట్టిని కొట్టి, తెలుగు పరిశోధక విద్యార్థులకు ఇప్పటికి ఒక సరికొత్త అధ్యయనాంశాలతో పుస్తకాన్ని ప్రచురించడం అభినందనీయమే.

ప్రసిద్ధ భాషావేత్త, సాహితీ చరిత్రకారుడు డా॥ కే.కే.రంగనాథాచార్యులు పర్యవేక్షణలో సీనియర్ జర్నలిస్టు, సాహితీవేత్త టీవీఆర్ కృష్ణ ముప్పయారేళ్ల కిందటి తన యం.ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని ‘ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు’ పేర్న ఇప్పటికైనా పుస్తకంగా తెచ్చి మంచి పని చేశారు. మామూలు వ్యాసాల కోవలో కాకుండా, ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసాల పరంపర స్థాయిలోనే ఒక సమగ్ర తులనాత్మక అధ్యయనం జరిపినట్లు చదువుతున్నకొద్దీ మనకు అర్థమవుతుంది. 19వ శతాబ్ది ద్వితీయార్ధపు సాహిత్య సరళులు, తీరుతెన్నులు, 20వ శతాబ్ది ఆరంభంలో రాజుల కాలాన వివిధ రూపాలలో వెలుగుచూసిన ప్రతీకాత్మక సంస్థాగతమైన కృషిని రచయిత సింహావలోకనం చేయడం వల్ల సాహిత్య సంస్థల ఆవిర్భావానికి ముందున్న నేపథ్యం చదువరులకు బోధపడుతుంది. అప్పటి నుండి ఇటీవలి వరకు సుమారు ఒక శతాబ్దికి పైగా కాలాన్ని ఆధునిక సాహిత్య యుగంగా రచయిత భావించి అక్కడ్నించి తన సవివర పరిశోధనను సాగించారు.

దాదాపు 113 సంవత్సరాల కిందటి ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ వంటి సాహిత్య సంస్థల ఆవిర్భావ వైభవోపేత చరిత్రను రచయిత కృష్ణ లోతుగానేకాక విమర్శనాత్మక, ప్రగతిశీల దృక్పథంతోనూ అధ్యయనం చేశారు. సాధారణ ఇతరేతర సంస్థల వలె కాకుండా తెలుగు సాహితీ వికాసానికి సమున్నత శక్తులుగా తోడ్పాటును అందించిన గొప్ప, ప్రతిష్ఠాత్మక సంస్థల కృషిని పుస్తకంలో స్థూలంగానైనా చదువుతాం. నిన్నమొన్నటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి వంటి గ్రంథమాలలు, నవ్యసాహిత్య సంస్థలు వంటివాటి  తీరుతెన్నులను పరిశోధనాత్మకంగా వివరించారు. తెనాలిలోని సాహితీ సమితి (1919), నవ్య సాహిత్య పరిషత్తు (1933), అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి (1943) సహా 1967 నాటి విప్లవ రచయితల సంఘం వరకూ మైలురాళ్లవంటి అన్ని సంస్థల పరిణామాల క్రమాన్నీ రచయిత చక్కగా విశ్లేషించారు. ప్రతిష్ఠాత్మక రంజని, యువభారతి, తెలంగాణ రచయితల సంఘం, ఫ్రీవర్స్ ఫ్రంట్, నవ్యసాహితీ సమితి, విజ్ఞాన వర్ధినీ పరిషత్తు వంటి సంస్థల పుట్టుపూర్వోత్తరాలను స్థూలంగానైనా అందించారు.

 దోర్బల బాలశేఖరశర్మ