calender_icon.png 17 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ తప్పిన పల్లె ప్రకృతి వనాలు

17-02-2026 12:49:36 AM

  1. లక్షలు ఖర్చుచేసి వృథాగా వదిలేశారు

గ్రామాల్లో కరువైన ఆహ్లాదం

పట్టించుకోని అధికారులు

బూర్గంపాడు, ఫిబ్రవరి16 (విజయక్రాంతి): ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనాన్ని కల్పించేందుకు గత ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు  క్షేత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ,అధికారుల పర్యవేక్షణ లేక ప్రకృతి వనాలు నేడు ఎడారిలా మారాయి.

మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారు తప్పా సంరక్షణ కోసం నీరు పోయడం విస్మరించారు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేశారు.లక్షలు ఖర్చుచేసి పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్వహణను గాలికి వదిలేశారు. పల్లెప్రకృతి వనాల్లో పశువులు, మేకలు సంచరిస్తున్నాయి.కొన్ని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలకు నీరు అందక ఎండిపోయాయి.

మరికొన్ని పల్లె ప్రకృతి వనాలు నిత్యం వచ్చి పోయే బాటసారులు, ఆకతాయిలకు అసాంఘిక కార్యక్ర మాలకు, మద్యం సేవించడానికి అడ్డాలుగా మారాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  జిల్లా,మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అస్తవ్యస్తంగా ఉన్న ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.