05-01-2026 12:00:00 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు అంటేనే మానవతా, సహాయానికి ముందుంటారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం కిషన్ గంజిలోని ఆర్యవైశ్య సంఘంలో నిరుపేద ఆర్యవైశ్యలకు ధనపాల్ లక్ష్మీబాయి-విట్టల్ గుప్తా ట్రస్ట్ ఆర్థిక సహకారంతో అలాగే ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రతినెల 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం నుండి 300 రూపాయలు, తన ట్రస్టు ద్వారా 200 రూపాయలు మొత్తం 500 రూపాయలు ప్రతినెల నిరుపేద ఆర్యవైశ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 72 మందికి తమ ద్వారా పింఛన్ అందుతున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే అందించే 500 పెన్షన్ తో పాటు ప్రతి నెల దాతలు ముందుకు వచ్చి 500 రూపాయల పింఛన్ తో పాటు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందివ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య పేద ప్రజలకు ప్రభుత్వం నుండి ఇండ్ల స్థలాలు రాకున్నా, పింఛన్ రాకున్నా తన క్యాంపు కార్యాలయానికి వచ్చి పేరు నమోదు చేసుకొని వెళ్ళవచ్చని వారికి అర్హులైతే పింఛన్ వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా , ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు దన్పాల్ శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా గాలి నాగరాజు గుప్తా లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.