ప్రజా చైతన్యానికి పత్రికలు!
నేడు మందుముల నరసింగరావు వర్ధంతి :
వాక్స్వాతంత్య్రం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ లేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికలద్వార చైతన్యము కలిగించవచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మకముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసనసభలు లేని, ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పథం లేని పరిపాలనలో, పత్రికల ప్రాముఖ్యత చాలా ఉం టుందని గ్రహించినాను.
రాజకీయ పార్టీలు లేని రాజ్యములో ప్రజాభిప్రాయము కల్గించడము ప్రజాసమస్యలను ఎదుర్కొనడము, ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడము, పత్రిక ల బాధ్యత. నిద్రిస్తున్న ‘యజమానిని కావలి కాసే కుక్క’ (watch---dog)యే విధంగా మేల్కొలుపుతుందో, అదే విధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొలిపి, తమ ప్రజాస్వామ్య హక్కు లు సాధించుకొనుటకు సిద్ధ పరచడమే ‘రయ్య త్’ పత్రిక బాధ్యత అని తలచి, సమస్యలు చర్చిం చే వాడిని.
అంతవరకు ప్రభుత్వ అధికారులను పొగడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా, వారు అవలంబించే అవకతవక చర్యలను బాగా విమర్శించే వాడిని. ప్రభుత్వమంటే ప్రజల్లో నున్న భయము పోగొట్టవలెనను దృష్టితో కొన్నికొన్ని పర్యాయములు, ఘాటుగా విమర్శించే వాడిని.
(పత్రికలు, పత్రికాధిపతుల బాధ్యతలు:
‘50 సంవత్సరముల
హైదరాబాదు’ నుంచి..)






