16-12-2025 01:57:52 AM
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రముఖుల జీవితాలను తెరపైకి తీసుకురావడానికి చాలా మంది మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఇష్టంగా చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహానటి, మహానాయకుడు, కథానాయకుడు లాంటి బయోపిక్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో లెజెండరీ బయోపిక్ తెరకెక్కనున్నట్టు సమాచారం.
ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి. ఈమె జీవిత కథను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ లాంటి భావోద్వేగభరితమైన కథలతో సినిమాలు చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కథకు సంబంధించి చర్చలు పూర్తి కావడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సినీవర్గాల భోగట్టా. అయితే, ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్ర ఎవరు చేస్తే బాగుటుందని తర్జనభర్జన పడ్డ మేకర్స్‌కు చివరగా మలయాళ బ్యూటీ సాయిపల్లవి పేరే గుర్తుకువచ్చిందట. ఆమె అయితేనే ఆ పాత్రకు సహజత్వం వస్తుందని ఫిక్స్ అయ్యారట. ఇదే నిజమైతే, సాయిపల్లవి కెరీర్‌లో ఇదొక మైలురాయి చిత్రం కావటం ఖాయం.