16-12-2025 01:56:49 AM
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్యపాత్రల్లో రూపొందిన తాజాచిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను పరులుగు పెట్టిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా డైరెక్టర్ మురళీకాంత్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివీ..
‘దండోరా’ కథ ఆలోచన ఎలా మొదలైంది?
మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. అది రొటీన్ లైఫ్ అనిపించేది. ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాలు రూపొందించాలన్న నా కోరిక మరింత బలంగా మారింది. నా మెదడులో చాలా కథలున్నాయి. అయితే ప్రేమకథల్ని నెరేట్ చేయడం చాలా కష్టం. సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనే ‘దండోరా’ తీశాను.
‘దండోరా’ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కులాలు, మతాల వారీగా భూమిని కేటాయిస్తారని నాకు అంతగా తెలీదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథ రాశా. మలయాళంలో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తాయంటారు. మన దగ్గర ఎందుకు రావు? అనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది.
‘బలగం’తో ఈ కథకు పోలికలేమైనా..?!
‘బలగం’ కథ వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగే పిండ ప్రధానం చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’ చిత్రంలో వ్యక్తి చనిపోయినప్పట్నుంచి పూడ్చిపెట్టే వరకు జరుగుతుంది. ‘బలగం’కు, ‘దండోరా’ కు ఎలాంటి పోలికలు, స్పూర్తి కానీ లేదు. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అన్నదే కథ. ఈ కథలో ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.
అన్ని పాత్రలు శివాజీ కారెక్టర్‌కు లింక్ అయి ఉంటాయి. ప్రతీ పాత్రకు స్కోప్ ఉంటుంది. బిందుమాధవి పాత్రైతే చాలా సర్‌ప్రైజింగ్.. చాలా శక్తిమంతమైన మహిళగా కనిపిస్తుంది. చిత్రంలో నిర్ణయాలన్నీ మహిళ పాత్రలే తీసుకుంటాయి.
వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి కదా..?!
ప్రభుత్వం వైకుంఠ ధామాల్ని ఏర్పాటుచేసింది. కానీ, అక్కడా వివక్షనే చూపిస్తుంటారు. అయితే, నేను ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారాన్ని చూపించానా.. లేదా? అన్నది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి.
టైటిల్ గురించి చెప్పండి..!
ముందుగా వేరే టైటిల్ అనుకున్నా. వర్కింగ్ టైటిల్ ‘అంతిమ యాత్ర’ అని పెట్టాం. అది అందరూ చూసి డల్‌గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్‌తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలన్నారు నిర్మాత. ఆ టైమ్‌లో ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘దండోరా’ అని కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది.
ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశించొంచ్చు?!
‘దండోరా’ టైటిల్ వినగానే అందరి మైండ్‌లో ఎన్నో ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారు. మార్క్ కే రాబిన్ మ్యూజిక్, ఆర్‌ఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆర్‌ఆర్ అందరినీ కదిలిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే అద్భు తంగా ఉంటుంది. ఓ అందమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు.