ఊరినిండా పనులు చేతినిండా అప్పులు!
కరీంనగర్, మే ౩౦ (విజయక్రాంతి): పైనున్న సర్కారు మాదే అని సంబరపడ్డరు. సార్ చెప్పిండని సంకలు గుద్దుకుంటూ పనులు చేశారు. చివరకు అప్పుల పాలయ్యారు. అటు సర్కారు మారడం, ఇటు పదవీకాలం ముగియడంతో మరింత ఆవేదనలో మునిగారు. త్వరలో ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉండడంతో తమ డబ్బులు ఎప్పుడొస్తాయోననే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 పంచాయతీల సర్పంచ్‌లు నేటికీ పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ చివరివా రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిచడానికి సిద్ధమవుతున్న తరుణంలో మాజీ సర్పంచులలో ఆందోళన మొదలయింది. పంచాయతీ సర్పంచుల పదవీకాలం జనవరిలో ముగిసింది. పదవీకాలం ముగిసిన అనంతరం ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే సర్పంచులు తమ పదవీకాలంలో వివిధ పనులకు అప్పులుచేసి ఖర్చు పెట్టిన నిధులు నేటికి రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలయింది.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉండగా, వివిధ పంచాయతీలకు 25 కోట్ల నిధులు పెండింగ్ బిల్లులకు సంబంధించి రావాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పాతబకాయిలు వస్తాయో రావో అన్న ఆందోళన మాజీ సర్పంచులలో మొదలయింది. నిధులను కేటాయించి ఎన్నికలకు వెళ్లాలని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో చాలామంది సర్పంచులు వివిధ పనులను పూర్తి చేసేందుకు తమ జేబుల నుంచి ఖర్చు పెట్టుకున్నారు. పంచాయతీ పాలకమండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు సర్పంచులు చేశారు.
వాటి బిల్లులు నేటికి అందలేదు. ట్రాక్టర్‌కు సంబంధించి బ్యాంకు వాయిదాలు, డీజిల్ బిల్లులు చాలా పంచాయతీలకు చెల్లించలేదు. 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ ఇచ్చే నిధులే పంచాయతీలకు ముఖ్యమైన ఆధారాలు. 2022 ఆగస్టు నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు రాలేదు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి 812 రూపాయల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల్సి ఉండగా, అవి కూడా రాలేదు. ఒక మేజర్ పంచాయతీలు తప్ప ఎక్కడా కూడా నేటికి ప్రత్యేకాధికారుల పాలనలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. చాలా పంచాయతీల్లో రైతు వేదికలు, వర్మి కంపోస్టులు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయగా, వీటికి సంబంధించిన నిధులు పూర్తిస్థాయిలో రాక సర్పంచులు అప్పులుచేసి బిల్లులు చెల్లించవలసి వచ్చింది.
సర్పంచుల పదవీకాలం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 2 నుండి ప్రత్యేకాధికారుల పాలన కిందకు పంచాయతీలురాగా ప్రస్తుతం ఖజానా ఖాళీ కావడంతో ప్రత్యేకాధికారులు కూడా చేతులెత్తేశారు. పారిశుధ్య కార్మికుల జీతాలు, పైపులీకేజీల మరమ్మత్తులు, బోర్ల మరమ్మత్తుల పనులు, ట్రాక్టర్లకు సంబంధించిన వాయిదాల చెల్లింపు, నెలనెలా విద్యుత్ బకాయిలు చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో విద్యుత్ బకాయిల బిల్లులు కోట్లకు దాటింది. గతంలో ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల ద్వారా విద్యుత్ పెండింగ్ బిల్లులు చెల్లించి నెట్టుకు వచ్చేవారు. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో ప్రత్యేకాధికారులు కూడా పంచాయతీ పాలనను నడపడం కష్టంగా మారింది.
ఏకగ్రీవాలకు రాని నిధులు
కరీంనగర్ జిల్లాలో 15 గ్రామ పంచాయతీలు 2018లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో రామడుగు మండలం పందికుంటపల్లి, చొప్పదండి మండలం మంగళపల్లి, హుజూరాబాద్ మండలం చిన్న పాపయ్యపల్లి, మందాడిపల్లి, మానకొండూర్ మండలం పోచంపల్లి, తిమ్మాపూర్ మండలం రాంహనుమాన్‌నగర్, వీణవంక మండలం నర్సింహులపల్లి, ఇల్లందకుంట మండలం వాగొడ్డురామన్నపల్లి, జమ్మికుంట మండలం సాంబునిపల్లి, సైదాపూర్ మండలం ఆరెపల్లి, ఎక్లాస్‌పూర్, రాములపల్లి, వెన్నెంపల్లి, గన్నేరువరం మండలం గోపాల్‌పూర్, సాంబయ్యపల్లిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 10 లక్షల రూపాయల నజరానాను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 15 పంచాయతీలకుగాను కోటి 50 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉండగా, సర్పంచులు పదవీకాలం ముగిసే నాటికి కూడా అవి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా చాలామంది వెనుకడుగేసే పరిస్థితి లేకపోలేదు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నేను ఒక దళిత సర్పంచును. రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌గా పోటీచేసి, గ్రామాన్ని అభివృద్ది చేయాలనే ఆశయంతో ప్రజల్లోకి వచ్చాను. మా గ్రామాన్ని మునుపెన్నడు లేని విధంగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టి చేతిలో చిల్విగవ్వ లేకపోయినా గ్రామాభివృద్ధి కోసం అప్పు చేసి కాపాడిన. నాకు ప్రభుత్వం నుంచి సుమారు 20 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. గ్రామంలో నిర్మించిన ఎల్లమ్మ, వేంకటేశ్వర స్వామి, మడేలయ్య ఆలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ ప్రత్యేక స్తంభాలను వేసి లైన్లు వేసిన ఖర్చులు 8 లక్షలు రావాలి. సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 5.50 లక్షలు, గ్రావెల్ పనులు 3.50 లక్షలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన కంచెకు 3 లక్షలు, స్థానిక గౌడ సంఘం భవన నిర్మానానికి 4.50 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లుల కోసం తిరిగి తిరిగి ప్రాణం పోతోంది. ఇప్పుడు ప్రత్యేక అధికారులు ఊరిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి.
జవ్వాజి శేఖర్, మాజీ సర్పంచ్, వెంకట్రావుపల్లి, రామడుగు మండలం సర్పంచ్‌గా పనిచేయడం కత్తిమీద సాములాంటిది
రామడుగు మండల కేంద్రంగా, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచుగా పనిచేయడం కత్తిమీద సాములాంటిది. ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్‌గా గెలిచి, గ్రామాభివృద్ధి కోసం పని చేయాలనే తపనతో సర్పంచ్ పదవీకాలంలో ఖర్చుల్లో సుమారు 60 లక్షలు రావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇతర అభివృద్ధి పనులను నిర్దేశిత లక్ష్యాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచులు మెడమీద కత్తిపెట్టి అధికారులు పనులు చేయించుకున్నారు. ఆ పనులు పూర్తి చేస్తే ప్రజల్లో గౌరవం ఉంటుందని అప్పు తెచ్చి పూర్తి చేశాం. ఇప్పుడు ఆ బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగాల్సి వస్తోంది.
ముఖ్యంగా సంవత్సరం క్రితం పూర్తయిన రెండు సంపద వనాల నిర్మాణానికి చెందిన 10 లక్షలు, స్థానిక ప్రాథమక పాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్ చేయాల్సిన మన ఊరు మనబడి పనులను తాను చేతులు ఎత్తేయడంతో అధికారుల ఒత్తిడి మేరకు అప్పుతెచ్చి పనులు చేశాను. దానికి సంబంధించిన 15 లక్షలు రావాల్సింది. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం సర్కార్ బళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కోసం 6 వందల కోట్లు విడుదల చేయడం జరిగింది. మేము గతంలో మన ఊరు మన బడిలో చేసిన పనులకు పైసలు లేవని చెప్పే ప్రభుత్వానికి అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు ఎట్లొచ్చినయ్. గ్రామంలో అన్ని అభివృద్ధి పనులకు మొత్తం 69 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మేము అప్పు తెచ్చి ఖర్చు చేసిన పైసలు ఎవరివ్వాలి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు భ్రష్టు పట్టిపోతున్నాయి.
-పంజాల ప్రమీల, మాజీ సర్పంచ్, రామడుగు






