తూతూ మంత్రంగా అసెంబ్లీ
- బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికే సభ
- ఆరు గ్యారెంటీలు, ప్రజా సమస్యలపై నిరాశే మిగిలింది
- మంత్రి పొంగులేటి అవినీతిని బయటపెడితే డైవర్షన్ పాలిటిక్స్ చేశారు
- కాళేశ్వరం కొట్టుకుపోతే.. మల్లన్నసాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడివి?
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): శాసనసభ సమావేశాలను బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తిచేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా నడిపారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు గ్యారెంటీలతోపాటు తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిల్చిందని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో హరీశ్‌రావు మాట్లాడారు.
శాసనసభ సమావేశాలు ఒక దిశానిర్దేశం లేకుండా ముగిశాయని, ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్‌ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక్క అంశంపైనా ప్రభుత్వం చర్చకు రాలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనీయ స్థితిలో సర్కారు ఉన్నదని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని ఆధారాలతో బయటపెడితే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు.
సభా సాంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలిచ్చారని, నియమనిబంధనలు, సభా మర్యాదలను, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజాసమస్యల మీద సూటిగా సమాధానం చెప్పకుండా తొండల భాష, కండల భాష వాడారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రవర్తించిన తీరు సభానాయకుడి హోదాకు తగినది కాదని, ప్రభుత్వం డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడమే ప్రతిపక్ష బాధ్యత అని, ఆ బాధ్యతను బీఆర్‌ఎస్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని వెల్లడించారు.
కేరళం ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అసెంబ్లీ
కేరళం ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? లేక కేరళం ఎన్నికల ప్రచారం ముఖ్యమా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని తెలిపారు.
అవినీతి నుంచి మంత్రిని కాపాడటానికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేసి, ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారని తెలిపారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి ఎలాంటి చర్చ లేకుండానే ముగించారని, పద్దులన్నీ చివరిరోజు పెట్టి పారిపోయారని మండిపడ్డారు. ఇరిగేషన్ పద్దు మీద కూడా కనీస చర్చ లేకుండా పాస్ చేసుకున్నారని విమర్శించారు.
అది పూర్తిగా డొల్ల బడ్జెట్
హౌస్ కమిటీ పనికిరాదని చెప్పి, శాసనసభ్యులకు, శాసనసభకు గౌరవాన్ని తగ్గించారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని, అది పూర్తిగా డొల్ల బడ్జెట్.. కాబట్టే చింపి తమ నిరసనను వ్యక్తంచేశామని తెలిపారు. ఈ విమర్శ ఆర్థిక మంత్రి భట్టిని వ్యక్తిగతంగా అన్నది కాదని, ఆ హోదాలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామని నొక్కిచెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి, ఇంత వరకూ నెరవేర్చలేదని, మీరు ప్రవేశపెట్టింది మూడో బడ్జెట్, మిగిలింది ఇంకొక్కటే బడ్జెట్ అని గుర్తుచేశారు.
కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలే అని వారే శాసనసభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందని, నిరుద్యోగుల ఆకాంక్షను సభలో గట్టిగా వినిపించామన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని రుజువు చేశామని తెలిపారు. రెండున్నర ఏళ్లలో దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వ వైనాన్ని సభా సాక్షిగా ఎండగట్టామన్నారు.
సీఎం మాట్లాడే భాష ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందే
కాంగ్రెస్ సభ్యులు సభలో కత్తుల కోలాటం ఆడుతాం, తలలు తీస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని పైల్వాన్ల భాష మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ప్రోత్సహించారని హరీశ్‌రావు మండిపడ్డారు రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా సభలో మాట్లాడుతున్న భాష కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందేనని డిమాండ్‌చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 90 వేల కోట్లు, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, కాళేశ్వరం దేశానికే ఆదర్శం అని కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు నాడు ప్రశంసించారని గుర్తుచేశారు. గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అది కాళేశ్వరంలో భాగం కాదా? అని నిలదీశారు.
గలగలా పారుతున్న ఆ గోదావరి నీళ్లు ఎక్కడివో, పండుతున్న పంట ఎక్కడిదో రైతులను అడుగుదామని కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. తాను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి 20 ఉత్తరాలు రాశానని, మాపై మీకు పగ, ద్వేషం ఉంటే శిక్ష వేయండి.. కానీ రైతుల పొట్ట కొట్టకండని పేర్కొన్నారు.
శాసనసభను గాంధీభవన్‌గా మార్చేశారు
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ బిల్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీని సమయానికి ప్రారంభించలేదని, సభ అంటే గౌరవం లేదని, శాసనసభను గాంధీభవన్‌గా మార్చేశారని విమర్శించారు.
అసెంబ్లీలో టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట ఉంటుందని కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఏకంగా 4 గంటలు టీ బ్రేక్ ఇచ్చారన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని 3 గంటలపాటు సభను ఆపారని గుర్తుచేశారు. కావాలనే లేట్ నైట్ వరకు సభ నడిపి, సభ్యులు లేకుండా చేయాలని చూశారన్నారు. అసెంబ్లీ పనిదినాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు.




