16కు అసెంబ్లీ సమావేశాలు వాయిదా
- తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహంపైనే చర్చ
- అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన బీజేపీ సభ్యులు
- బీఆర్‌ఎస్ సభ్యుల ప్రాతినిధ్యం నిల్
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అసెంబ్లీలో సోమవారం ప్రారంభమై న శీతాకాల సమావేశాలు కేవలం ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఉదయం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై మొదలైన చర్చ మధ్యా హ్నం 2 గంటలకు ముగిసింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమావేశాలను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
తొలుత సమావేశం ప్రారంభమయ్యే ముందు బీజేపీ నుంచి ఆరుగురు సభ్యులు సభకు హాజరయ్యారు. స్పీకర్ వారిలో ఐదుగురు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం కల్పిం చారు. వారు పలు అంశాలపై అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రొటోకాల్ అంశంపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నిరసన తెలిపిన తీరు అధికారపార్టీని ఇరకాటంలో పెట్టింది.
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల సభకు హాజరు కాలేదు. ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సభకు గైర్హాజరయ్యారు. తర్వాత సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీఆర్‌ఎస్ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా సభకు వచ్చేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సభలో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం లేకపోయింది.
ఎమ్మెల్యే పోచారం శ్రీని వాస్‌రెడ్డి కాంగ్రెస్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. తర్వాత వరుసగా సీఎం రేవంత్‌రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు.
సభకు హాజరైనప్పటికీ ఎంఐఎం సభ్యుల్లో ఒక్కరైనా తెలంగాణ తల్లి విషయంపై స్పందించలేదు. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం మండలి సమావేశాలను ఈ నెల 16కు వాయిదా వేశారు.






