12-05-2025 03:05:02 AM
జగిత్యాల అర్బన్, మే 11 (విజయక్రాంతి): శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గురు నిరుపేద యువతుల పెళ్లిలకు చేయూతనందించారు. రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన పేరూరి శ్రీచందన, లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన గుగ్గిల్ల శివప్రియ, కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సోనీ అనే ముగ్గురు పేద యువతుల వివాహానికి దాతల సహాయంతో చేయూతనందించినట్లు సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ తెలిపారు.
ముగ్గురు యువతుల పెళ్లిళ్లు నిశ్చయం కాగా వారి ఆర్థిక స్థితి బాగా లేకపోవడంతో వారి బంధువులు సత్యసాయి సంస్థ దృష్టికి తీసుకువచ్చి వీలైన సహాయం అర్థించారని తెలిపారు. స్పందించిన సంస్థ సభ్యులు వ్యాపారవేత్త కొత్త ప్రతాప్ - సంధ్యారాణి దంపతులను సంప్రదించగా వారి 50వ పెళ్లిరోజు సందర్భంగా యువతుల పెళ్లిళ్లకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
పెళ్లికి కావలసిన ముఖ్య వస్తువులు బంగారు మంగళ సూత్రం , వెండి మెట్టెలు, పెళ్లి చీర , మంగళ హారతి సెట్, కన్యాదాన తాంబూలం మరియు చెంబు, స్టీల్ బిందె, ప్లేట్లు, గ్లాసులు తదితర వస్తు సామాగ్రితో పాటూ 25 కిలోల బియ్యంతో మొత్తం ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున 45 వేల విలువైన సామాగ్రిని ముగ్గురికి అందజేసినట్లు రాజేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, చిటుమల్ల లక్ష్మీనారాయణ , నలమాస్ రాజశేఖర్, మహిళా సభ్యులు చిటుమల్ల జయశ్రీ , బట్టు శ్రీలత, జిల్లా లక్ష్మి, వూటూరి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.