12-05-2025 03:05:06 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): శిక్ష పూర్తయ్యేలోపు ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం జైళ్లశాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో నిర్వహించిన ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు ముగింపు వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగా ణ జైళ్లశాఖ అమలు చేస్తున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయని వివరించారు. తెలిసోతెలియకో చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అనేక చేతివృత్తులు, ఇతర పనుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
ఖైదీలు మానసిక ఒత్తిడికి గురికాకుండా నిపుణులతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఖైదీలు తయారుచేసే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా వారిని మరింత ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జైలుకు కావాలని ఎవరూరారని, బయటకు వెళ్లిన తర్వాత మరోసారి అలాంటి తప్పు చేయకుండా గౌరవంగా జీవించాలని సూ చించారు.
సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు అండగా ఉంటామని వెల్లడించారు. శిక్షను అనుభవించే సమయంలో ఆందోళనకు గురికావొ ద్దని, అలాగే కాలాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సూచించారు.
ఒకవేళ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే నిబంధనల ప్రకారం జైళ్ల శాఖ తరఫున సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.