14 June, 2026 | 1:43 AM

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

14-06-2026 12:00 AM
  1. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వేస్తుండగా ప్రమాదం 
  2. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లిలో ఘటన  

సంగారెడ్డి, జూన్ 13(విజయక్రాంతి): సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన తలారి రంజిత్ కుమార్ (34) విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని సమాచారం అందడంతో దానిని అమర్చేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో ఫ్యూజ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 11 కేవీ లైన్‌కు కుడి చేయి తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే సహచరులు, స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.