మా అమ్మను ఆదుకోరూ!
- 10 నెలల క్రితమే నాన్న మృతి.. అమ్మకేమో క్యాన్సర్
- ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అగమ్యగోచరం
- కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని అంకితం చేసిన హుస్నాబాద్ కార్యకర్త కుటుంబం
- చేయూతనివ్వాలని చిన్నారుల వేడుకోలు!
హుస్నాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఒకవైపు తండ్రి మరణం.. మరోవైపు తల్లి క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతుండటంతో తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక కన్నీటి పర్యంతమవుతున్న ఇద్దరు చిన్నారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కర్ర రవీందర్‌రెడ్డి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదగాథ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది.
కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కర్ర రవీందర్‌రెడ్డికి భార్య రజనీ, కుమారుడు శ్రీతన్‌రెడ్డి, కుమార్తె స్నిగ్ధరెడ్డి ఉన్నారు. పది నెలల క్రితం ఆయన కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో కుటుంబం కష్టాల కడలిలోకి నెట్టబడింది. మొదట కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన రవీందర్‌రెడ్డి.. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో హైదరాబాద్ నిమ్స్ ఆసు పత్రికి వెళ్లారు.
వారంలో మూడు రోజులు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాల కోసం పోరాడారు. అనంతరం గుండెపోటు రావడం తో నిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఇంతలో భార్య రజనీ ఆరోగ్యం కూడా క్షీణించింది. మూడు నెలలుగా ఘన ఆహారం తీసుకోలేక కేవలం ద్రవ పదార్థాలతోనే జీవనం సాగించిన ఆమెకు వైద్య పరీక్ష ల్లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిం ది. భార్య క్యాన్సర్ బారిన పడటం, ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న సమయంలోనే రవీందర్ రెడ్డి కన్నుమూశారు.
పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరు?
తండ్రి మరణించగా, తల్లి క్యాన్సర్‌తో మంచానికే పరిమితమైంది. ఒకవైపు అమ్మ ఆరోగ్యం కోసం ఆందోళన, మరోవైపు తమ చదువులు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో చిన్నారులు స్నిగ్ధరెడ్డి, శ్రీతన్‌రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్త కుటుంబానికి పరామర్శలు తప్పా శాశ్వత భరోసా కనిపించడం లేదు.
ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త కుటుంబం నేడు తీవ్ర ఆర్థిక, మానసిక సంక్షోభంలో ఉంది. అధికారంలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు ఈ కుటుంబానికి అండగా నిలవాలని కార్యకర్తలు కోరుతున్నారు.
అలిగిరెడ్డి అభయం.. పొన్నం పరామర్శ
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి గతంలో రవీందర్‌రెడ్డి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవీందర్ దహన సంస్కారాలకు, దశదిన కర్మలకు అయ్యే ఖర్చును భరిస్తానని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల చదువుకు తాను బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు చెపుతున్నారు.
మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ రవీందర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన సహాయం అందలేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబానికి సహాయం చేయదలచిన వారు, యూకో బ్యాంక్, హుస్నాబాద్ ఖాతా సంఖ్య: 0700321105334, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: యూసీబీఏ0000700కు చేయాలని వేడుకుంటున్నారు.






