14 June, 2026 | 1:30 AM

గిరిజన హక్కులను రక్షించాలి

14-06-2026 12:09 AM
  1. వైద్యానికీ దూరమవుతున్న గిరిపుత్రులు
  2. ఇంకా పరిష్కారం కాని గిరిజన ప్రాంతాల్లో భూసమస్య
  3. ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలెన్నో మిగిలే ఉన్నాయ్
  4. ఉస్మానియా వర్సిటీ సదస్సులో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): గిరిజనులను, వారి హక్కులను రక్షించాలని, వారి సమస్యలను పరిష్కరించి, గిరిజన సమగ్రాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పాటుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. గిరిజనులు ఇప్పటికీ నాణ్యమైన వైద్యానికి దూరమవుతుండడం బాధాకరమన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి నప్పుడు గతంలో ఉన్న అనేక గిరిజన గ్రామాలు, గూడేలు, పెంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

గిరిజన జనాభా తగ్గుదల, జీవన విధానంలో వస్తున్న మార్పులు, సంప్రదాయ ఆవాసాలు అంతరించిపోవడం అంశాలు ఆందోళన కలిగిస్తున్నా యని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అత్యంత కీలకమైన సమస్యల్లో భూ సమస్య ఒకటన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధి అనే అంశంపై జరిగిన సదస్సులో రాంచందర్ రావు మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, అయితే ఈ పథకాల ఫలితాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందాలంటే మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యంత కీలక సమస్యల్లో భూ సమస్య ఒకటని, ముఖ్యంగా పోడుభూముల సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు.

ఈ అంశంపై అనేక వేదికల్లో, శాసన మండలిలో కూడా చర్చించినప్పటికీ, శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్న ప్పటికీ గిరిజనుల భూ హక్కుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు. తమ భూములు, హక్కులు, జీవనాధారాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఇప్పటికీ పోరాటాలు చేయాల్సి వస్తుండటం బాధాకరమన్నారు. గిరిజనుల భూ హక్కులను రక్షించే విధం గా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని కోరారు. భూముల కొనుగోలు, అమ్మకాలు, భూ హక్కుల పరిరక్షణ, గిరిజన భూములపై ఆక్రమణలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

వైద్యానికీ దూరంగా గిరిజనులు

గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, అనేక చోట్ల అవి సమర్థవంతంగా పనిచేయడం లేదని, చెంచు లు, కోయలు, సంతాళ్లు, మైదాన ప్రాంత గిరిజనులు సహా వివిధ గిరిజన వర్గాల ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలకు ఇంకా దూరంగానే ఉన్నారని తెలిపారు. శుద్ధమైన తాగునీటి లభ్యత లేకపోవడం, పోషకాహార లోపం, ఆరోగ్య అవగాహన కొరత వంటి కారణాలతో గిరిజన ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

గిరిజనుల అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ప్రత్యేక గుర్తింపును కూడా పరిరక్షించాలన్నారు. అభివృద్ధి పేరుతో వారి మూలాలను దెబ్బతీయకుండా, వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. విద్య, ఆరోగ్యం, భూమి అనే మూడు అంశాలు గిరిజన సమాజ సమగ్రాభివృద్ధికి పునాదులుగా నిలుస్తాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బంజారా, నోమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ వంటి వర్గాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను కూడా గుర్తించి, వారికి అవసరమైన రక్షణ, అవకాశాలు, సంక్షేమ కార్యక్ర మాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి గిరిజన వర్గానికి సమానంగా అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.