హైదరాబాద్‌లో జోరువాన
- రోడ్లపై నిలిచిన నీళ్లు.. ట్రాఫిక్ జాం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- అల్వాల్‌లో విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి
- చెరువును తలపించిన శంషాబాద్ జాతీయ రహదారి
- ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్/మేడ్చల్/శంషాబాద్‌జూన్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి, శనివారం సా యంత్రం జోరు వాన కురిసింది. రోడ్డుపై నీళ్లు నిలిచి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. లోతట్లు ప్రాంతాలు జలమయమ య్యాయి. రోడ్డుపై చెట్ల కొమ్మలు, విద్యు త్ స్తంభాలు విరిగి పడ్డాయి. శంషాబాద్ లో జాతీయ రహదారి చెరువును తలపించడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షం కారణంగా పలు విమానాల దారి మళ్లించారు. అల్వాల్‌లో తెగిపడిన విద్యుత్ తీగలతో కరెంట్ షాక్‌కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాందేవ్ గూడా, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, హైదర్‌గూడా, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం ప్రాంతాలను ముం చెత్తింది. మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీ షరీ ఫ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ బాచుపల్లి, హైదర్‌నగర్, ప్రగతినగర్ మూసాపేట్ పరిసరాల ప్రాంతాల్లో వాన జోరుగా పడింది.
శంషాబాద్‌లో దంచికొట్టిన వాన
శంషాబాద్ పరిధిలో శనివారం కురిసిన భారీ వర్షం స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో జాతీయ రహదారి చెరువును తలపించింది. రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీటిలోనే ప్రయాణించాయి.
రోడ్డు పక్కన ఉన్న పలు దుకాణాల్లోకి, బేస్‌మెంట్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సామగ్రి తడిసిపోయి, వ్యాపారాలు సాగక వర్తకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా, మున్సిపాలిటీ, పోలీసు శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించారు. భారీ మోటార్ల సహాయంతో రోడ్డుపై నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేశారు. షాద్‌నగర్‌లో భారీ వర్షానికి జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచింది.
బెంగళూరు-హైదరాబాద్ హైవేపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా శం షాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబయి, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం కారణంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. మల్కంపేట చెరువు, టోలిచౌకీల్లో పరిస్థితిని పరిశీలించారు. సైబరాబాద్ సీపీ రమేష్ కలిసి నీటమునిగిన ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించాలన్నారు.
అచ్చంపేటలో భారీ వర్షం
అచ్చంపేట: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గం ఉమామహేశ్వర ఆలయం కొండల పైనుంచి భారీగా వరద నీరు పారుతున్నది. అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని బ్రిడ్జిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ బ్రిడ్జి వద్దకు చేరుకుని గ్రామ ప్రజలతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి చౌటపల్లి గ్రామానికి శాశ్వత పరిష్కారంగా హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.
తెగిపడిన విద్యుత్ వైర్లు.. తండ్రి, కూతురు మృతి
మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లకు తండ్రి కూతురు బలయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి వర్ష బీభత్సానికి చెట్ల కొమ్మలు కారుపై పడ్డాయి. కారును తీయడానికి సందీప్ (45) బయటకు రాగా ఆయనతో పాటే కూతురు రితిక (16) కూడా వచ్చింది.
తెగిపడిన విద్యుత్ వైర్లను గమనించకుండా రితిక పట్టుకోవడంతో షాక్‌కు గురైంది. ఆమెను రక్షించడానికి తండ్రి ప్రయత్నించగా ఇద్దరికీ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి సహాయం చేయడానికి వచ్చిన సందీప్ భార్య శ్వేతకు కూడా కరెంట్ షాక్‌కు గురైంది. ఆమె చికిత్స పొందుతున్నారు.
నాలుగో రోజులు వర్షాలే
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ శనివారం అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రం గారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు 40-50 కి.మీ ఈదురు గాలు లతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం ఉమ్మడిమహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురువనున్నాయి. మంగళవారం, బుధవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఈ మేరకు తెలిపింది.
భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్ జారీ
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలన్నారు.






