5 April, 2026 | 10:59 PM

గుండెపోటుతో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి మృతి

14-05-2024 02:30 AM

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఘటన 

భద్రాద్రి కొత్తగూడెం, మే 13(విజయక్రాంతి)/అచ్చంపేట: పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాలో విషాదం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ సోమవారం గుండెపోటు తో మృతిచెందారు. కొత్తగూడెం జెడ్పీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచే స్తున్న శ్రీకృష్ణకు  అశ్వారావుపేట నెహ్రూనగర్ పోలింగ్ బూత్ (165)లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా విధులు కేటా యించారు. ఆయన సోమవారం పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో కుప్పకూలాడు. సహోద్యోగులు ఆయనను చికిత్స నిమిత్త ఆశ్వారావుపేట సర్కారు దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. విధినిర్వాహణలో మృత్యువాత పడటంతో సహచర సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 

ఓటర్లపై తేనేటీగల దాడి

* ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లపై తేనేటీగలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ పరిదిలోని జేపీఎస్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకొంది. ఓటు వేయ డానికి వచ్చిన ఎస్‌కే మీరా హుస్సేన్, ఆఫ్రీన్, నందుపై తేనేటీగలు దాడిచేశా యి. వీరిలో హుస్సేన్ తీవ్రంగా గాయపడటంతో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. 

* ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన అమ్రా బాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ప్రజలపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. ఆ సమయంలో దాదాపు ౩౦ మంది ఉన్నారు. తేనెటీగల దాడితో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని 108 అంబులెన్సులో అచ్చంపేట సర్కారు దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

ఓటు గల్లంతు

కొత్తగూడెం పట్టణ పరిధిలోని కూలీలైన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లిన గౌసియాబేగం ఓటు గల్లంతైంది. ఆమె వెళ్లేసరికే ఓటును ఎవరో వేశారని సిబ్బంది చెప్పడంతో అవాక్కయింది.  

ఓటుకు నోటు ఇవ్వలేదని..

సాధారణంగా తమ గ్రామంలో అభివృద్ధి చేయలేదనో, సౌకర్యాలు కల్పించలేదనో పోలింగ్ బహిష్కరించిన ఘటనలు చూస్తుంటాం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామస్థులు తమకు డబ్బులు పంపి ణీ చేయలేదని ఆరోపిస్తూ పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్నికల వేళ తమ గ్రామంలో ఏ పార్టీ నాయకులు ఎవరికీ డబ్బులు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సముదాయించడంతో చివరకు మధ్యాహ్నం ౩ గంటలకు ఓటు వేశారు.