30 June, 2026 | 2:11 AM

సీలింగ్‌తోనే రైతుకు ‘భరోసా’

30-06-2026 12:00 AM

మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’లో ఈ ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. అయితే, ఒకే దఫా కాకుండా తొమ్మిది రోజుల్లో ఆర్థిక సహాయం అందిస్తుండటంతో కొందరిలో ఈ పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్‌లో సన్నకారు రైతులకు రైతుభరోసా అందింది.

కానీ, నాలుగైదు ఎకరాలు, ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్న రైతులకు గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందకపోవడం అందలేదు. గత ప్రభుత్వం అప్పులు నెత్తిన పెట్టిందని మొత్తుకుంటూనే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపితం చేయడమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.

అయితే, గత ప్రభుత్వ హయాంలో సాగుకు నోచుకోని భూములకు భరోసా ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం.. తెలంగాణలో దాదాపు 74 లక్షల మంది పట్టాదారులున్నారు. సుమారు 1.58 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.

అంతేకాదు, రైతుబంధు కింద రూ.25,672 కోట్లను  వ్యవసాయం చేయని భూములకు ఇచ్చారని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక స్పష్టం చేసింది. ఈ క్రమంలో వ్యవసాయం చేయని భూములకు పెట్టుబడి సాయం అందించకూడదని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలి. అయితే, గత పాలకులు ఈ పథకం విషయంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నుంచి మూడు ఎకరాల రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నదని గగ్గోలు పెడుతున్నారు.

కాగా, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ, రైతులకు పంటసాయం అందించాలని సంక ల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. వాస్తవానికి రైతు భరోసా విషయంలో సీలింగ్ విధిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇన్ని ఎకరాలకు మాత్రమే భరోసా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయమే తీసుకోలేదు. దీంతో భరోసా నిధులు భూస్వాములకే ఎక్కువగా అందుతున్నాయన్న విమర్శలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే భరోసా ఇవ్వాలన్న మంచి నిర్ణయం తీసుకున్నట్టుగానే రెండు హెక్టార్లకు గాని, 5 ఎకరాలకు గాని భరోసాను పరిమితం చేయాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎకరాకు రూ.15 వేలు చొప్పున 60 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే పంటసాయం చేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో అందరికీ రైతు భరోసా ఇవ్వలేదని పదే పదే విపక్షాలు విమర్శలు చేయకుండా నివారించినట్టు కూడా అవుతుంది. తెలంగాణలో ఐదెకరాలకు పైగా భూములున్న రైతులు సుమారు 15 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. వారి భూముల మొత్తం విస్తీర్ణం ఎంత ఉన్నప్పటికీ, సాగుకు యోగ్యంగా ఉన్న సుమారు ఐదెకరాలకు మాత్రమే భరోసా అందేలా చూడాలి.

అయితే, సాగుకు యోగ్యంగా ఉన్న భూముల గుర్తింపును పారదర్శకంగా చేపట్టాలి. పక్కాగా డాటా సేకరించాలి. శాటిలైట్ సర్వేలో తప్పులు దొర్లితే ప్రభుత్వానికి మళ్లీ ఆర్థిక భారం తప్పదు. సీలింగ్ విధించకపోవడం వల్ల భూస్వాములకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతున్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రొ. సంగని మల్లేశ్వర్

 వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి,

9866255355