30 June, 2026 | 2:10 AM

పర్యవేక్షణ లేని ప్రైవేట్ హాస్టళ్లు

30-06-2026 12:00 AM

కామిడి సతీష్ రెడ్డి :

హాస్టళ్ల నిర్వహణ లాభసాటి వ్యాపారంగా మారడంతో తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకు అనుబంధంగా వేలాది హాస్టళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యాసంస్థలకు అనుగుణంగానే గాక వర్కింగ్ మెన్, ఉమెన్ హాస్టళ్ల పేరుతో కుప్పలుతెప్పలుగా వసతి గృహాలు పురుడు పోసుకుంటున్నాయి. హాస్టళ్ల ఏర్పా టు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా ఒక శాఖ  లేక పోవడంతో నిర్వాహకులకు ఆడిందే ఆటగా తయారైంది.

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూ ళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులపై ఉంటుంది. ఆయా హాస్టళ్లపై అవసరమైతే కలెక్టర్, ఇతర ఉన్నతాధికా రుల అజమాయిషీ కూడా ఉంటుం ది. దీంతో మెనూ, ఇతర సౌకర్యాల కల్పనపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న హాస్టళ్లలో పర్యవేక్షణ బాధ్యతలు అటు విద్యాశాఖకు గాని, ఇంటర్మీడియట్ అధికారులకు గాని లేవు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న హాస్టళ్లలో నిర్వాహకులు కేవలం ధనార్జనే ధ్యే యంగా వ్యవహరిస్తున్నారు. హాస్టళ్ల పేరిట వేలకు వేలు ఫీజులు దోచుకుంటున్నా అడిగేవారు లేరు. అడ్మిషన్ల సమయంలో చెప్పి న విధంగా ఎక్కడా మెనూ, ఇతర సౌకర్యా లు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాస్టల్ ఉంటేనే ఆయా విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు.

ఇంటిపట్టున ఉంటే చదువుపై ఆసక్తి ఉండదనే ఉద్దేశంతో హాస్టళ్లు ఉన్న స్కూళ్లు, కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు. తల్లిదండ్రుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న హాస్టళ్ల ని ర్వాహకులు వారి నుంచి అందినకాడికి దం డుకుంటున్నారు. ఈ క్రమంలో అకాడమిక్ ఫీజుల కంటే హాస్టళ్ల నిర్వహణ ద్వారానే యజమానులు భారీగా సంపాదిస్తున్నారు. వాస్తవానికి ప్రైవేటు హాస్టల్ ప్రారంభించేవా రు విధిగా సంబంధిత స్థానిక సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొందాలనే నిబంధన ఉంది.

దాంతోపాటు అగ్నిమాపక శాఖ అనుమతులు కూడా తీసుకోవాలి. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, తాగు నీరు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించే అధికారం కూడా స్థానిక సంస్థల అధికారులకు ఉం టుంది. అయితే ఎన్వోసీలు జారీచేస్తున్న సంబంధిత అధికారులు ఆ తర్వాత కనీసం పర్యవేక్షించకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. తనిఖీలు చేసేవారు లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల అనుబంధ హాస్టళ్లలో కనీస రక్షణ చర్య లు పాటించడం లేదు.

ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నా పట్టించుకునేవారు లేరు. బాత్రూంల వద్ద తెల్లవారు జాము నుంచే విద్యార్థులు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇక మెనూ అమలు దేవుడెరుగు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గోడు వినే ఓపికా, సమయం తల్లిదండ్రులకు లేకపోగా, ధనార్జనే ధ్యేయంగా ఉన్న యాజమాన్యాలకు వారి బాగోగులు అవసరం లేకుం డాపోయింది.

మూణ్నాలుగు అంతుస్తుల్లో హాస్టళ్లు ఏ ర్పాటు చేస్తున్న నిర్వాహకులు కనీస జాగ్ర త్తలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. అగ్నిప్రమాదాలు సంభవిస్తే భవనం చుట్టూ ఫైరింజన్ తిరిగేలా ఏర్పాట్లు ఉండా లి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆ వెసులుబాటు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు భారీమూల్యం చెల్లించు కోక తప్పదు. హాస్టళ్లల్లో రక్షణ కోసం గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడంతో పై అంతస్తు నుంచి గతంలో విద్యార్థులు పడిపోయిన ఘటనలు ఉన్నాయి.

అధికారులు పర్యవేక్షించాలి

ఇప్పటికైనా సంబంధిత అధికారులు హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం ఎన్వోసీ జారీతోనే సరిపెట్టకుండా హాస్టళ్ల నిర్వహణపై కూడా వారు దృష్టిసారిస్తే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రైవేటు హాస్టళ్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అనుమతులు లేని హాస్టళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే హాస్టళ్లలో ప్రమాదాలను ముందు గానే అరికట్టగలరు.

 తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు,

9848445134