అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం: డిప్యూటీ సీఎం పవన్
అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదని తెలిపారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని తాను రాగానే చెప్పానని వెల్లడించారు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది.
అచ్యుతాపురం ఎసెన్షియా అడ్బాన్స్ డ్ సైన్స్ స్ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. రియాక్టర్ లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్ పై పడటంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 36 మందికి గాయాలయ్యాయి. గాయపడిన 36 మందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లిలోని ఉష ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. అచ్యుతాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు.






