10 April, 2026 | 1:55 AM

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం

10-04-2026 12:11 AM
  1. రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతి వేగంతో ఢీ కొట్టిన కారు

వంద మీటర్లు ఫాల్టీ కొట్టిన వ్యక్తిని మళ్ళీ తొక్కిస్తూ పరార్

నిందితుడు మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడిగా గుర్తింపు

నెల రోజుల తరువాత బయట పడ్డ ఘోరం రోడ్డు ప్రమాదం 

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని అత్యంత వేగంగా కారుతో ఢీ కొట్టిన కారు ఓనర్ మానవత్వాన్ని కూడా మరచి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి పైనుంచి తొక్కుకుంటూ పరారైన ఘటన గత నెల 6న చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన తుమ్మల భాస్కర్(48) పంచర్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 6న పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి భర్త, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే వ్యక్తి నాగర్ కర్నూల్ నుండి పెద్దకొత్తపల్లి వైపు కారులో వెళుతున్నాడు.

పెద్దముద్దునూర్ గ్రామంలో రోడ్డు దాటుతున్న భాస్కర్ ను అతి వేగంతో ఢీ కొట్టాడు. వెంటనే గాయపడిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి పైనుంచి అదే కారుతో తొక్కించి మరీ పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు గమనించి ఆ వ్యక్తిని జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 7న మృతి చెందాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా రెండు రోజుల క్రితం ఓ కారు షెడ్ వద్ద రిపేర్ కోసం తీసుకొచ్చిన కారు ను గుర్తించారు. వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారును యాజమానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ అధికార పార్టీకి చెందిన ప్రధాన లీడర్ అంటూ చెప్పుకునే వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో తాను లేనని ఇతరులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.