11 March, 2026 | 6:18 PM

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు

11-03-2026 03:20 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలీస్, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ శాఖల అధికారులు, డివిఎంసీ సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం, పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 31 కేసులు నమోదు కాగా, 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆసిఫాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో మూడు కేసులు, కాగజ్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలో మూడు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నమోదైన కేసులను త్వరితగతిన విచారణ చేసి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అట్రాసిటీ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి అశోక్, ఓ. దత్తారావు, సీఐ బాలాజీ వరప్రసాద్, డివిఎంసీ సభ్యులు కేశవరావు, సిడాం అర్జున్, గంగుబాయి, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.