భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు
ఈ ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం తప్ప ఏమీ లేదు
సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం తప్ప ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులకు బినామీలు (సురేష్, దామోదర్ రావు, కిషోర్) ఉన్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో లక్ష మందికి ఇళ్ల పట్టాలిచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కూల్చడం ఎందుకు.. ఇళ్లు కట్టిస్తామనడం ఎందుకు? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కూల్చిన ఇళ్లు మళ్లి కట్టించేవరకు తాము పోరాడతామని కేటీఆర్ ప్రకటించారు. ''మీకు నచ్చిన వారికి ఇస్తారు.. నచ్చని వాళ్లకు ఇవ్వరా?, మీరు సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా'' అని కేటీఆర్ ధ్వజమెత్తారు. భూ మాఫియా చేసింది మీరే అన్నారు. కచ్ఛితంగా సమగ్ర విచారణ జరిపిస్తామని కేటీఆర్ సూచించారు. పేదవారికి 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవారికి కూడా పట్టాలివ్వలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఉన్న భూములు దోచుకోవడానికే కూల్చివేతలు చేపట్టారని కేటీఆర్ మండిపడ్డారు. 3000 మంది పోలీసులతో శత్రుదేశం మీదకి యుద్దానికి పోయినట్లు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్లి పేదలను ఇళ్లు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.




