21-08-2025 01:24:51 AM
-నెట్టేసి, జుట్టు పట్టుకునిఈడ్చిన నిందితుడు
-హత్యాయత్నం కేసు నమోదు
-మానసిక సమస్యలతో సతమతం: నిందితుడి తల్లి
-దాడులతో నా స్ఫూర్తిని దెబ్బతీయలేరు:ముఖ్యమంత్రి రేఖా గుప్తా
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై రాజేశ్ భాయ్ కిమ్జీ భాయ్ సకారియా (41) అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సీఎం రేఖా గుప్తా తన నివాసంలో ప్రతి బుధవారం నిర్వహించే ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమంలో భాగంగా ముఖ్య మంత్రికి వినతి సమర్పిస్తున్నట్టు నటించి ఆమెను నెట్టేశాడు. అనంతరం ముఖ్యమంత్రి జుట్టు పట్టుకుని లాగాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రిపై దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఖండించారు. నింది తుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్ వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సీఎంను చెంపపై కొట్టాడని మొదట్లో ప్రచారం జరిగినా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆ ప్రచారాన్ని ఖండించారు. దాడి చేసిన సకారియా ఓ ఆటోరిక్షా డ్రైవర్. అతడికి వివాహం అయింది. ఇది వరకే అతడిపై గుజరాత్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి.
జరిగింది ఇదీ..
ఢిల్లీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేఖా గుప్తా ప్రతి వారం నిర్వహించే ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమానికి రాజేశ్ అనే వ్యక్తి సామాన్యుడిలా వచ్చాడు. ఏదో వినతిపత్రం సమర్పిస్తున్నట్టు నటించి సీఎంపై దాడి చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడికి మతిస్థితిమితం సరిగ్గా లేదని అతడి తల్లి పోలీసులకు తెలిపారు. ‘వీధి కుక్కల విషయంలో తీర్పు అనంతరం ఢిల్లీకి వెళ్లాడు. నా కొడుకు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇం ట్లో కూడా ప్రతి ఒక్కరిని కొట్టేవాడు. నన్ను కూడా కొట్టాడు. నేను 15 రోజులు బయటే ఉన్నాను. మానసిక సమస్యలు ఉన్నా కానీ మందులు తీసుకోవడం లేదు.
జంతువులంటే ప్రాణం. వీధి కుక్కల విషయంలో తీర్పు తర్వాత మరింత కలత చెందాడు. కొట్టడం అతడి సహజ స్వభావం’ అని నిందితుడి తల్లి పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆప్ నేత అతిశీ కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడితో రేఖాగుప్తా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ దాడులు నన్ను ఆపలేవు: సీఎం
దాడిపై సీఎం రేఖా గుప్తా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఉదయం జరిగిన దాడి కేవ లం నా మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఢిల్లీకి సేవచేయాలి, ఉన్నత స్థానంలో ఢిల్లీని నిలపాలనే మా సంకల్పంపై జరిగిన పిరికిపంద చర్య. ఇటువంటి దాడులు నా సంక ల్పాన్ని, ప్రజలకు మేలు చేయాలనే ఆశయా న్ని ఆపలేవు. ఇంతకు ముందు కంటే ఎక్కువ శక్తితో ప్రజలకు సేవ చేస్తాను’ అని పేర్కొన్నారు.