21-08-2025 01:35:56 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంపై, యూరియా ఎరువుల సరఫరాపై భారీ వర్షాల ప్రభావాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, గోదావరి నదికి, ముఖ్యంగా భద్రాచలం వద్ద వరదలు మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన మంత్రి తుమ్మల ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న సవాళ్ల మధ్య ఎరువుల అత్యవసర అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆగస్టు నెలకు సంబంధించిన యూరియాను రాష్ట్రానికి ఆలస్యం చేయకుండా అందజేయాలని మంత్రి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేయాల్సిందంతా చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. యూరియా విషయంలో కేంద్రం కూడా సహకరించాలని మంత్రి కోరారు. యూరియాను కనీసం చూడని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలు కావద్దని హితువు పలికారు. తనను విమర్శించే వారు కేంద్రమంత్రి నడ్డాను అడగవచ్చు అన్నారు. యూరియా సరఫరాపై అన్ని లెక్కలు ఇస్తున్నానని తెలిపారు. రాంచందర్ రావు అంటే తనకు గౌరవం ఉందన్న మంత్రి తుమ్మల అబద్ధాలు చెప్పి బీజేపీని బాగుచేయాలంటూ సాధ్యం కాదన్నారు. రైతులను రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరని చురకలంటించారు.
రామచందర్ రావు వాస్తవాలను ఒప్పుకోవాలని హెచ్చరించారు. యూరియాపై ఎప్పటికప్పుడు లెక్కలు కేంద్రానికి పంపుతున్నామని ఆయన పేర్కొన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రామచందర్ రావు విమర్శలు సరికాదన్నారు. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాపై బీజేపీ అసత్య ప్రచారం మానుకోవాలని కోరారు. రామచందర్ రావుకు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలని సవాల్ విసిరిన మంత్రి తుమ్మల రామచందర్ రావుకు అంత పలుకుబడి ఉందని నేను అనుకోన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందని మంత్రి వెల్లడించారు. యూరియా దాచుకుని మేం ఏం చేసుకుంటాం? అని ప్రశ్నించిన తుమ్మల నాగేశ్వర్ రావు పదేపదే రాంచందర్ రావు విమర్శలు సరికాదని సూచించారు. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మందలించారు. యూరియాపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడానని మంత్రి తుమ్మల(Minister Tummala) వివరించారు.