21-08-2025 01:23:23 AM
-ఇండియా కూటమి నేతలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పరిచయం చేసిన ఖర్గే
-హాజరైన సోనియా,రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు. బుధవారం ఇండియా కూటమి ముఖ్యనాయకులకు సుదర్శన్ రెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ‘రెడ్డి జడ్జిగా ఉన్న సమయంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో తీర్పులు ఇచ్చారు.
ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం కుర్చీ కోసం కాదు. ఇదో సైద్ధాంతిక పోరు. అధికార పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని సమర్థించినప్పటికీ ప్రతిపక్షం రాజ్యాంగానికి విలువనిస్తోంది. గత 11 ఏండ్లుగా బీజేపీ ప్రతిపక్షాలపై వివక్ష చూపుతోంది. సభలో బిల్లులను తొందరగా ఆమోదిస్తోంది.
స్పీకర్ కూడా ఎంపీలను మాట్లాడనివ్వకుండా వారి గొంతు నొక్కుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ఎన్సీపీ (శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత తిరుచి శివ పాల్గొన్నారు.