ఇక టార్గెట్‌గా అటాక్స్!
అక్రమార్కుల వేటలో వాణిజ్య పన్నుల శాఖ
జీఎస్టీ చెల్లింపులపైనే ప్రధాన గురి
సర్కారు ఆమ్దానీ పెంచడంపై స్పెషల్ ఫోకస్
జాబితా రూపకల్పనలో అధికారులు తలమునకలు
ఇంటిదొంగలపై అంతర్గత విచారణకు వ్యూహాత్మక అడుగులు
2, ౩ రోజుల్లో ప్రభుత్వానికి అందనున్న నివేదిక
ఎన్నికల కోడ్ ముగిశాక రంగంలోకి అధికారులు
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): జీఎస్టీ, వ్యాట్ వసూళ్లను పెంచే మార్గాలపై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జీఎస్టీని ఎగవేస్తున్న వారే లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, జీఎస్టీ అక్రమాల్లో డిపార్ట్‌మెంట్ అధికారులే అక్ర మార్కులకు సహకరిస్తున్నారన్న సమాచారంతో.. అంతర్గత విచారణలు చేపడుతోంది.
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్లు ఆశించినంత లేకపోవడంపై ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన వాణిజ్య పన్నుల శాఖ.. జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని చేరేందుకు అనుసరించాల్సి వ్యూహంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జీఎస్టీ ఎగవేతదారుల జాబితాను సిద్ధం చేస్తోంది. పన్నులు ఆశించినంత ఎందుకు వసూలు కావడం లేదనే అంశంపై అధ్యయనం చేస్తోంది.
కేంద్రానికి వచ్చే జీఎస్టీలో ఏడాదికేడాది భారీగా వృద్ధి నమోదువుతుండగా.. రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎందుకు లేదనే అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ చాలా కీలకమైనది. ఈ శాఖ పరిధిలో నిత్యం రాబడి ఉంటుంది. అలాగే వార్షికంగా కూడా ఆదాయం భారీగా పెరుగుతుంది. కానీ కొంతకాలంగా ఆదాయం అంచనాలను అందుకోవడం లేదు.
గత రెండేళ్ల గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. 2022 రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.37,026కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 2023 40,650కోట్ల రాబడి వచ్చింది. ఈ క్రమంలో గతేడాది జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రంలో కేవలం 10శాతం వృద్ధి మాత్ర మే నమోదైంది. మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాల వ్యాట్‌పై 2022 29,516కోట్లు, 2023 రూ. 29,985 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యాట్‌లో కేవలం రాష్ట్రం 2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. ద్వారా అన్ని పన్నుల ద్వారా గతేడాది రూ.83,500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ కేవలం రూ.72, 157కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. ఈ క్రమంలో ఆదాయాన్ని పెంచడంపై పన్నుల శాఖ ఫోకస్ పెట్టింది.
ఎగవేతదారులకు అధికారుల సాయం
జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఎగవేతదారులకు అధికారులు సహకరిస్తున్నట్లు అంతర్గత దర్యాప్తులో తేలింది. తాజాగా రూ.వెయ్యికోట్ల జీఎస్టీ ఎగవేతలో ఐఐటీ ప్రొఫెసర్‌తో పాటు, ముగ్గురు వాణిజ్య పన్నులు శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. వ్యాపారస్తులు జీఎస్టీ ఎగవేసేందుకు ఈ ముగ్గురు అధికారులే సహకరిస్తున్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జీఎస్టీ చెల్లింపులో పారదర్శకతను తీసుకొచ్చేందుకు హైదరాబాద్ ఐఐటీలోని ఒక స్టార్టప్‌తో వాణిజ్యపన్నుల శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ క్రమంలో పన్నుల శాఖ ఆన్‌లైన్ వ్యవహారలను స్టార్టప్ కంపెనీ నిర్వహించేది. ఈ నేపథ్యంలో సదరు ఐఐటీ ప్రొఫెసర్ తన అధికారులను ఉపయోగించి.. స్టార్టప్‌కి చెందిన ఆన్‌లైన్ పోర్టల్‌లో జీఎస్టీ చెల్లించాల్సిన పలు కంపెనీల పేర్లను కనిపించకుండా చేశారు. దీనిద్వారా ఆయా కంపెనీలు దాదాపు రూ.వెయ్యికోట్ల జీఎస్టీని ఎగవేశాయి. ఇన్నాళ్లు పర్యవేక్షణ లేకపోవడం వల్లే.. ఇలా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక
రాష్ట్రంలో ఏ మార్గాలను అనుసరిస్తే.. జీఎస్టీ, వ్యాట్ వసూళ్లలో లక్ష్యాలను చేరుకోవచ్చనే అంచనాలపై వాణిజ్య పన్నుల శాఖ తీవ్రమైన కసత్తులు చేస్తోంది. అక్రమార్కుల జాబితాను తయారు చేయడంతో పాటు భవిష్యత్‌లో ఏం చేయాలనే అంశంపై నివేదికను సిద్ధం చేస్తోంది. ఆ నివేదికలో కీలక విషయాలను పొందుపరుస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ వసూళ్లు ఎందుకు తగ్గాయి? అందులో ఏమైనా బడా కంపెనీలు ఉన్నాయా? గతంలో ఎక్కువ జీఎస్టీ కట్టి.. ఇప్పుడు తక్కువ కడుతున్న కంపెనీలు ఏవి? ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఏ విధంగా పన్నులు చెల్లించకుండా తప్పించుక్నుంటున్నారు? వారి నుంచి పన్నులు రాబట్టే వ్యూహంపై వాణిజ్య పన్నుల శాఖ కీలక రిపోర్టును సిద్ధం చేస్తోంది. ఈ రిపోర్టును మూడు రోజుల్లో పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత..
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ ఎగవేతదారుల భరతం పట్టేందుకు సిద్ధణవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత.. సర్కారు సూచనల మేరకు అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయితే పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇస్తారా? లేకుంటే నేరుగా దాడులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
హిట్ లిస్ట్‌లో ప్రభుత్వ శాఖలు
వాణిజ్య పన్నుల శాఖ హిట్ లిస్ట్‌లో అబ్కారీ శాఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అబ్కారీ శాఖ దాదాపు రూ.54కోట్ల జీఎస్టీని ఎగవేసిందని కొన్నిరోజులుగా పన్నుల శాఖ ఆరోపిస్తోంది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పన్ను ఎగవేతదారుల లిస్టును సిద్ధం చేస్తున్న సంబంధిత అధికారులు.. ఆ జాబితాలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మరికొన్ని శాఖలను కూడా చేర్చుతున్నట్లు తెలుస్తోంది.






